రైలు ఢీకొని పెద్ద పులి మృతి

రైలు ఢీకొని పెద్ద పులి మృతి
నంద్యాల, ఆంధ్రప్రభ : నంద్యాల – గిద్దలూరు నల్లమల్ల అడవి మార్గంలో రైలు ఢీకొని ఓ చిరుత పులి మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
మహానంది మండల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో చలమ రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
సోమవారం అటవీ శాఖ, రైల్వే శాఖ అధికారులు సంయుక్తంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో జంతువులు రైల్వే ట్రాక్ దాటే క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
రైల్వే డ్రైవర్ హారన్ కొట్టినప్పటికీ చిరుత పట్టాలపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
మృతి చెందిన చిరుత పులికి అటవీ శాఖ అధికారులు పోస్టుమార్టం నిర్వహించి అనంతరం దహనం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
