Temple Tourism Andhra Pradesh | ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు

Temple Tourism Andhra Pradesh | ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు

Temple Tourism Andhra Pradesh | శ్రీశైలానికి పెరిగిన భక్తుల ప్రవాహం
కనకదుర్గమ్మ ఆలయానికి కోటి దాటిన భక్తులు
రాహు-కేతు పూజలతో శ్రీకాళహస్తికి పెరిగిన ఆదరణ
ఏడు ఆలయాల ఆదాయం రూ.800 కోట్లు

Temple Tourism Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక క్షేత్రాలు రాష్ట్రంగా మరోసారి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు రెండేళ్లలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఆలయాల ఆదాయాలు కూడా రికార్డు స్థాయిలో పెరగడం విశేషం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయం, శ్రీకాళహస్తి దేవాలయం, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం, ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయం వంటి పుణ్యక్షేత్రాలు భక్తి తరంగాలతో నిండిపోతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తే, ఆలయాల అభివృద్ధి పనులు, సాంకేతిక సేవల విస్తరణ, రవాణా సౌకర్యాల పెంపు, భక్తులకు మెరుగైన వసతులు, పారదర్శక పరిపాలన వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

శ్రీశైలానికి పెరిగిన భక్తుల ప్రవాహం

నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం రెండేళ్లలో అపూర్వమైన భక్తి జోరును చూసింది. 2023-24లో 82 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 1.19 కోట్లకు చేరింది. ఆలయ ఆదాయం కూడా రూ.178 కోట్ల నుంచి రూ.217 కోట్లకు పెరిగి దాదాపు రూ.39 కోట్ల అదనపు వృద్ధిని నమోదు చేసింది. మహాశివరాత్రి, కార్తీకమాసం, దసరా, ఉగాది వంటి పర్వదినాల్లో శ్రీశైలం లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. ఘాట్ రోడ్ల అభివృద్ధి, క్యూ లైన్ల విస్తరణ, ఉచిత అన్నప్రసాద కేంద్రాల పెంపు, పార్కింగ్ సదుపాయాల మెరుగుదల వల్ల భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

కనకదుర్గమ్మ ఆలయానికి కోటి దాటిన భక్తులు

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవాలయంకు భక్తుల రాక రోజు రోజుకీ పెరుగుతోంది. 2023లో 93 లక్షలుగా ఉన్న భక్తుల సంఖ్య 2025-26 నాటికి 1.19 కోట్లకు చేరడం విశేషం. ఆలయ ఆదాయం రూ.141 కోట్ల మార్కును దాటింది. ప్రత్యేకించి దసరా శరన్నవరాత్రుల సమయంలో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఆన్లైన్ టికెట్లు, ప్రత్యేక దర్శనాలు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి చర్యలు భక్తులకు ఎంతో ఉపశమనం కలిగించాయి.

ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు

కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బోయకొండ గంగమ్మ దేవాలయం, మహానంది దేవాలయం వంటి దేవాలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు రహదారులు, తాగునీరు, విద్యుత్, వసతి గృహాలు, పార్కింగ్ వంటి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఇదిలా ఉండగా స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ లాభాలు సమకూరుతున్నాయి. దేవాలయాలకు పెరుగుతున్న భక్తుల రాకతో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కూడా బలపడుతోంది. హోటళ్లు, లాడ్జీలు, టూరిజం రంగం, రవాణా సేవలు, పూల వ్యాపారం, ప్రసాదాల తయారీ, చిన్న వ్యాపారులు లాభపడుతున్నారు. శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం, అన్నవరం ప్రాంతాల్లో వీకెండ్ టూరిజం గణనీయంగా పెరిగినట్లు టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా సంస్కరణల వల్లే ఆలయాలపై భక్తుల విశ్వాసం పెరిగింది. ఆలయ భూముల రక్షణ, పారదర్శక ఆర్థిక నిర్వహణ, డిజిటల్ సేవలు, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

రాహు-కేతు పూజలతో శ్రీకాళహస్తికి పెరిగిన ఆదరణ

రాహుకేతు పూజలకు ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023లో 74 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, 2025-26 నాటికి 83 లక్షలకు చేరింది. ఆలయ ఆదాయం రూ.126 కోట్ల నుంచి రూ.131 కోట్లకు పెరిగింది. పూజల కోసం ముందస్తు ఆన్లైన్ బుకింగ్, ప్రత్యేక కౌంటర్లు, వేగవంతమైన దర్శన వ్యవస్థతో భక్తులు సులభంగా సేవలు పొందుతున్నారని అధికారులు తెలిపారు.

ఆలయాలు ఇప్పుడు కేవలం పూజా స్థలాలుగానే కాకుండా ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధికి కేంద్రాలుగా మారుతున్నాయి. భక్తుల రద్దీ పెరగడం వల్ల స్థానిక ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆధ్యాత్మికత, అభివృద్ధి, సాంకేతికత కలిసొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక రాష్ట్రంగా మరింత బలంగా నిలిచే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడు ఆలయాల ఆదాయం రూ.800 కోట్లు

రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల కలిపి ఆదాయం 2023-24లో రూ.759 కోట్లుండగా, 2025-26 నాటికి రూ.800 కోట్లకు చేరింది. ఈ జాబితాలో కాణిపాకం వినాయక స్వామి దేవాలయం, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఆలయాలున్నాయి. ఈ దేవాలయాలకు వచ్చిన భక్తుల సంఖ్య 4.6 కోట్ల నుంచి 5.3 కోట్లకు పెరిగినట్లు దేవాదాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆదాయం రెండేళ్లలోనే భారీగా పెరిగింది. 2023లో రూ.23 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26 నాటికి రూ.56 కోట్లకు చేరింది. భక్తుల సంఖ్య 73 లక్షల నుంచి 85 లక్షలకు పెరిగింది. సోషల్ మీడియా ప్రచారం, స్థానిక ఉత్సవాల వైభవం, రవాణా సౌకర్యాల పెంపు వల్ల ఈ ఆలయానికి మరింత ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply