IPL 2025 | చరిత్రలో కొత్త అధ్యాయం.. ఆర్సీబీకి తొలి టైటిల్ !

  • ఆహ్మదాబాద్‌లో పంజాబ్‌పై అద్భుత విజయం
  • 17 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర !

ఆర్సీబీ అభిమానులంతా వేచి చూసిన రోజు రానే వ‌చ్చేసింది. 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఎన్నోసారి దాదాపు గెలుపు దాకా వెళ్లిన ఆర్సీబీ… చివరికి 2025లో తమ మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ రాజత్ పటిదార్ నేతృత్వంలో ఆ జట్టు పునర్నిర్మితమై, గెలుపు దిశగా అడుగులు వేసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది.

టాస్ ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఐదుగురు ఆటగాళ్లు 20 పరుగులకు పైగా చేయడం వలన పిచ్‌పై ప్రత్యర్థికి ఎటూ పారిపోయే వీలుకాలేదు.

విరాట్ కోహ్లీ – 43 (35 బంతుల్లో) స్థిరంగా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ 24 (18 బంతుల్లో) శరవేగంగా ఆడుతూ మంచి ఆరంభానికి తోడ్పడ్డాడు. రాజత్ పటిదార్ 26 (16 బంతుల్లో): కెప్టెన్‌గా మిడిల్ ఓవర్లలో దూకుడైన ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు.

లివింగ్‌స్టోన్ 25 (15 బంతుల్లో) తన హిట్టింగ్ శక్తిని చూపిస్తూ వేగంగా పరుగులు చేశాడు. జితేష్ శర్మ 24 (10 బంతుల్లో) డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడి స్కోరు వేగాన్ని పెంచాడు. షెపర్డ్ 17 (9 బంతుల్లో) తుది దశలో కీలక పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ స్కోరు పెద్దగా అనిపించకపోయినా, తుది పోరులో ఒత్తిడిలో ఇది బలమైన టోటల్‌గా నిలిచింది.

పంజాబ్ ఛేజ్.. శ్రేయస్ సేనకు నిరాశ !

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగినా, ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ మ్యాచ్‌పై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ప్రారంభంలో ప్రియాన్ష్ ఆర్య (24), ప్రభ్ సిమ్రన్ (26), జోష్ ఇంగ్లిష్ (39) జట్టుకు మంచి ఆరంభాన్ని అందించగా, అనంతరం పంజాబ్ బ్యాటర్లు అదే దూకుడును కొనసాగించలేకపోయారు.

ఆర్సీబీ బౌలర్లు మధ్య ఓవర్లలో పుంజుకొని వరుసగా కీలక వికెట్లను తీసి పంజాబ్‌కు తీవ్రమైన ఒత్తిడిని కలిగించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1), నేహాల్ వధేరా (15), మార్కస్ స్టోయినిస్ (6), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1) పేలవంగా విఫలమవడంతో పంజాబ్ విజయ ఆశలు కష్టంగా మారాయి. తుది ఓవర్లలో శశాంక్ సింగ్ (61) వీరోచితంగా ప్రయత్నించినా, పంజాబ్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేష్వ‌ర్ కుమార్, క్రుణాల్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా… య‌ష్ ద‌యాల్, జోష్ హేజిల్ వుడ్, షెప‌ర్డ్ త‌లా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు.

పాటిదార్ నాయకత్వం – కొత్త శకం

అనుభవం తక్కువే అయినా, రజత్ పాటిదార్ తన కెప్టెన్సీ చాతుర్యంతో అందరి మెప్పు పొందాడు. ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలింగ్ మార్పులు, ఒత్తిడిలో ఎదుర్కోని తీసుకున్న నిర్ణయాలు అతన్ని ఐపీఎల్ విజేతగా నిలిపింది. దీంతో ర‌జ‌త్ పాటీద‌ర్ ఆర్సీబీకి మొదటి టైటిల్ అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.

అంబరానికి అంటిన‌ సంబరాలు

ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బెంగళూరు వీధుల్లో అభిమానుల సెల‌బ్రేష‌న్ మొదలయ్యాయి. సోషల్ మీడియా మొత్తం #RCBChampions2025 హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తింది. సుదీర్ఘ నిరీక్షణ ముగింపు, విరాట్‌కు అరుదైన గౌరవం, రజత్‌కు హీరో హోదా – ఇవన్నీ కలిసి చరిత్ర సృష్టించాయి.

Leave a Reply