Interest | తల్లిదండ్రుల్లో ఆందోళన..
Interest | తల్లిదండ్రుల్లో ఆందోళన..
Interest | గడువు మించితే వడ్డీ విధింపు.. తల్లిదండ్రుల్లో కలవరము
కొత్త విద్యాసంవత్సరం ముందే ఫీజుల ఒత్తిడి
మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం
విద్యా రంగంలో వ్యాపార ధోరణిపై విమర్శలు
ప్రభుత్వం జోక్యం కోరుతున్న తల్లిదండ్రులు
Interest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విద్యా రంగంలో కార్పొరేట్ పాఠశాలలు అమలు చేస్తున్న కొత్త విధానాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. నిర్దేశిత గడువులోగా ఫీజులు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని హెచ్చరిస్తూ కొన్ని పాఠశాలలు కొత్త నిబంధనలను అమలు చేయడం ప్రారంభించాయి. ఈ పరిణామం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
రాజమహేంద్రవరం నగరంలోని ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఒక కార్పొరేట్ పాఠశాలలో ఈ విధానం అమలులోకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇప్పటికే పాఠశాల యాజమాన్యం ఫీజుల చెల్లింపుపై స్పష్టమైన గడువులు విధించింది. ఆ గడువు దాటితే అదనంగా వడ్డీతో పాటు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని తెలియజేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా కొత్త విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులను వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటం వివాదాస్పదంగా మారింది. కొంతమంది తల్లిదండ్రులు ఈ విధానాన్ని అన్యాయంగా పేర్కొంటూ, పాఠశాలల యాజమాన్యాలు తమపై ఆర్థిక భారం మోపుతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో, ఒకేసారి భారీగా ఫీజులు చెల్లించడం తమకు కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. పైగా వడ్డీ విధించడం వంటి నిబంధనలు అమలు చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ తరహా విధానాలు ఇతర కార్పొరేట్ పాఠశాలల్లో కూడా అమలులోకి వస్తాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే, రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత పెద్ద వివాదంగా మారే అవకాశం ఉందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.
