హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ గుల్జార్ హౌస్ సమీపంలో ఒక పురాతన భవనంలో నిన్న సంభవించిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతైన నేపథ్యంలో, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రమాదం ఒక గుణపాఠం లాంటిదని ఆయన పేర్కొన్నారు.ఈ దురదృష్టకర సంఘటనపై ఆయన మాట్లాడుతూ, “పాతబస్తీ గుల్జార్ హౌస్ దగ్గర్లోని భవనంలో జరిగిన అగ్నిప్రమాదం మనందరికీ ఒక గుణపాఠం వంటిది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పురాతన కట్టడాలలో అగ్నిమాపక భద్రతా నియమాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంలో విఫలం కావడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణ, పాత భవనాల్లో భద్రతా ప్రమాణాల పెంపునకు సంబంధించి త్వరలోనే ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని ఆయన వెల్లడించారు. పాత భవనాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, వాటిని కచ్చితంగా అమలుపరిచేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు.