భూపనపాడు గ్రామానికి భరోసాగా నిలిచిన జిల్లా కలెక్టర్…
భూపనపాడు గ్రామానికి భరోసాగా నిలిచిన జిల్లా కలెక్టర్…
30 ఏళ్ల సమస్యలకు ఆరు నెలల్లో శాశ్వత పరిష్కారం..
“భూపనపాడు ఆడపడుచు”గా కలెక్టర్ రాజకుమారికి గ్రామస్థుల ఘన సన్మానం…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కారం చూపితే గ్రామాల రూపురేఖలు ఎలా మారుతాయో భూపనపాడు గ్రామం నేటి పరిస్థితి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో పాణ్యం మండలం భూపనపాడు గ్రామ ప్రజలు తమ గ్రామ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతగా జిల్లా కలెక్టర్ రాజకుమారిని ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత కలిసి గజమాలలు, పసుపు-కుంకుమలతో ఆమెకు సత్కారం నిర్వహించారు.

ప్రేమాభిమానాల సూచకంగా కలెక్టర్‌ను “భూపనపాడు ఆడపడుచు”గా అభివర్ణించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూపనపాడు బీసీ కాలనీకి జిల్లా కలెక్టర్ చొరవతో కొత్త జీవం లభించిందన్నారు. గత 30 ఏళ్లుగా కాలనీలో సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడేవారమని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొనేదని వివరించారు.
గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా గ్రామాన్ని సందర్శించి, వర్షంలోనే కాలనీ వీధులన్నీ తిరిగి పరిస్థితిని పరిశీలించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించిన ఆమె వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సీసీ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ నిర్మాణ పనులను మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఆమె ప్రత్యేక చొరవతో కేవలం ఆరు నెలల్లోనే పనులు పూర్తై గ్రామం పూర్తిగా మారిపోయిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వర్షం కురిసినా నీరు నిల్వ లేకుండా డ్రైనేజీ ద్వారా సాఫీగా వెళ్లిపోతోందని, ఆధునిక సదుపాయాలతో కూడిన రహదారులు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఈ విజయం ఒక్కరి కృషి ఫలితం కాదని, ఇంజనీరింగ్ శాఖతో పాటు అన్ని విభాగాల అధికారుల సమిష్టి కృషివల్లే సాధ్యమైందన్నారు.
గ్రామ ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామ అభివృద్ధి, ఉమ్మడి సమస్యల పరిష్కారానికి ఏకమై కృషి చేయడం తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. తక్కువ సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేసిన అధికారులను ఆమె అభినందించారు. తమపై చూపిన ప్రేమాభిమానాలకు భూపనపాడు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి సేవలను గ్రామస్థులు కొనియాడారు. ఇలాంటి అధికారులు జిల్లాకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.
