రూ.6 కోట్లతో రైతు బజార్ విస్తరణకు శ్రీకారం…
రూ.6 కోట్లతో రైతు బజార్ విస్తరణకు శ్రీకారం…
150 మంది రైతులకు ప్రయోజనం.. రెండు అంతస్తులతో ఆధునిక సదుపాయాలు
కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి టీజీ భరత్
అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి: ఎంపీ బస్తిపాటి నాగరాజు.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్త పేర్కొన్నారు. కర్నూలు సి-క్యాంపులోని రైతు బజార్ విస్తరణ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడారు.
రూ.6 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ విస్తరణ పనుల ద్వారా సుమారు 150 మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను ఆధునిక సదుపాయాలతో విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన స్ప్రింక్లింగ్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్, విశాల పార్కింగ్ సౌకర్యం, రెండు అంతస్తుల భవనం నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. పనులను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
సీఎం హామీ అమలు దిశగా చర్యలు..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఈ రైతు బజార్‌ను సందర్శించిన సందర్భంగా రైతులతో మాట్లాడి విస్తరణకు హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. 1999లో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన రైతు బజార్ వ్యవస్థపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విస్తరణ పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
రైతు బజార్‌తో పాటు అన్న క్యాంటీన్ రైతు బజార్ నిర్మాణం పూర్తయిన వెంటనే పేదల కోసం ముఖ్యమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అన్న క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేవలం రూ.15కే మూడు పూటల భోజనం అందించేలా క్యాంటీన్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
హైకోర్టు బెంచ్, నూతన కలెక్టరేట్‌పై మంత్రి స్పష్టం..
కర్నూలు బి-క్యాంపులో హైకోర్టు బెంచ్‌తో పాటు అత్యాధునిక సదుపాయాలతో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ప్రతి వారం అభివృద్ధి కార్యక్రమాలు..
ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలులో ప్రతి వారం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. రైతు బజార్ విస్తరణతో ట్రాఫిక్ సమస్యకు కూడా కొంతవరకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ రోడ్డు విస్తరణ, స్పోర్ట్స్ హాస్టల్‌ను తిరుపతికి తరలించకుండా కర్నూలులోనే కొనసాగించడం, బి-క్యాంపులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
ఆధునిక మార్కెటింగ్‌కు ఊతం రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే విధంగా రైతు బజార్ విస్తరణ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ అజమత్ బీ, వైస్ చైర్మన్ శేషగిరి, ఇంజనీర్ రఘురామరెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
