IPL 2025 | ర‌స‌వ‌త్త‌రంగా ప్లేఆఫ్స్ పోరు.. రేపే ఐపీఎల్ పునఃప్రారంభం !

  • ఇదీ జ‌ట్ల ప‌రిస్థితి

భారత్ – పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తమతమ ఫ్రాంచైజీల క్యాంప్‌ల్లో చేరుతున్నారు. కొంతమంది విదేశీ ఆటగాళ్ల లభ్యత తప్ప, లీగ్ మునుపటిలా కొనసాగడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. కాగా, రేప‌టి పునఃప్రారంభం రోజున జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ బెంగళూరులో జరుగనుంది.

టాప్‌లో గుజరాత్‌

ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న గుజరాత్‌ లీగ్‌ వాయిదా పడే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్‌ 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి 16 పాయింట్లు​ సాధించింది. గుజరాత్‌ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారవుతుంది.

ప్లే ఆఫ్స్‌ రేసులో మొత్తం ఐదు జట్లు

లీగ్‌ వాయిదా పడే సమయానికి ఐదు జట్లు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. ఇంకా ఏ జట్టుకు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అధికారికంగా ఖరారు కాలేదు. ప్లే ఆఫ్స్‌ రేసులో గుజరాత్‌ (16), ఆర్సీబీ (16) ముందు వరుసలో ఉండగా.. పంజాబ్‌ (15), ముంబై ఇండియన్స్‌ (14), ఢిల్లీ (13) పోటాపోటీ పడుతున్నాయి.

కేకేఆర్‌, లక్నో కూడా రేసులోనే..!

లీగ్‌ వాయిదా పడే సమయానికి కేకేఆర్‌ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.

ఈ మూడు టీమ్‌లు ఔట్‌

ఇక ఇప్ప‌టికే సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఆరెంజ్‌ క్యాప్‌ హెల్డర్‌గా సూర్యకుమార్‌..

లీగ్‌ వాయిదా పడే సమయానికి ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ వద్ద ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) ఉంది. స్కై ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 63.75 సగటున 170.57 స్ట్రయిక్‌రేట్‌తో 510 పరుగులు చేశాడు.

నూర్‌ అహ్మద్‌, ప్రసిద్ద్‌ కృష్ణ వద్ద పర్పుల్‌ క్యాప్‌

లీగ్‌ వాయిదా పడకముందు ప్రసిద్ద్‌ కృష్ణ (గుజరాత్‌), నూర్‌ అహ్మద్‌ (సీఎస్‌కే) వద్ద పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) ఉంది. వీరిద్దరు తలో 20 వికెట్లు తీశారు.

పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది. 57 మ్యాచ్‌లు సజావుగా సాగిన ఐపీఎల్ 2025, భారత్‌, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్ మధ్యలో బ్రేక్‌ పడింది.

ఇదిలా ఉంటే, టోర్నమెంట్ కు బ్రేక్ ప‌డిన‌ సమయంలో పాయింట్ల పట్టిక ఈ విధంగా ఉంది.

  • గుజ‌రాత్ టైటాన్స్ 16 పాయింట్లు – (0.793)
  • రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 16 పాయింట్లు – (0.482)
  • పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లు – (0.376)
  • ముంబై ఇండియ‌న్స్ 14 పాయింట్లు – (1.156)
  • ఢిల్లీ క్యాపిట‌ల్స్ 13 పాయింట్లు – (0.362)
  • కోల్‌కతా నైట్ రైడర్స్ 11 పాయింట్లు – (0.193)
  • లక్నో సూపర్ జేయింట్స్ 10 పాయింట్లు – (–0.469)
  • సన్ రైజర్స్ హైదరాబాద్ 7 పాయింట్లు – (–1.192)
  • రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లు – (–0.718)
  • చెన్నై సూపర్ కింగ్స్ 6 పాయింట్లు – (–0.992)

Leave a Reply