ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే…

ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే…
గన్నవరం – ఆంధ్రప్రభ : చెరువులు ఊరి ఉమ్మడి ఆస్తులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరి పైన ఉందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శనివారం బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో గత 14 ఏళ్లుగా పూడికతో నిండిపోయి నిరుపయోగంగా మారిన అంపాపురం కోడి కాలవ పునరుద్ధరణ పనులను ఆయన స్థానిక నాయకులు, రైతులతో కలిసి స్వయంగా పరిశీలించారు.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించినందుకు గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు కాలవ నుంచి గ్రామంలోని మూడు ప్రధాన చెరువులకు నీటిని అందించే ఈ కోడి కాలవ 14 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. స్థానికులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక, ఎమ్మెల్యే తన సొంత నిధులతో గతంలో అందించిన మూడు మోటార్ల సహాయంతో నీటిని లిఫ్ట్ చేసి నేరుగా చెరువులు నిండేలా చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో ఆక్రమణలకు గురైన చెరువులను స్వయంగా పర్యవేక్షిస్తూ బాగు చేయించి అభివృద్ధి చేయడమే కాకుండా, త్వరలో ఈ చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అలానే ఎక్కడెక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలో చూసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 14 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గ్రామస్తులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పార్టీ అధ్యక్షుల సుంకర రాజా వేణు గోపాల్, బాపులపాడు మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు వలివేటి కిషోర్, టీడీపీ నాయకులు అల్లంశెట్టి శ్రీమన్నారాయణ, కోడె రేవంత్ ,యాళ్ళ శ్రీధర్, కోడె శ్రీనివాసరావు, దండుబోయిన రాంపండు, పుట్టి నాగరాజు, అల్లంశెట్టి శేషు, మోతుకూరి మాణిక్యాలరావు గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


