అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీగా బంగారం పట్టుబడినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఎస్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా ఓ ఇంట్లో దాదాపు 107కిలోల పుత్తడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
బంగారం అక్రమ రవాణాపై ఇటీవల పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. స్మగ్లింగ్ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్ మెంట్ లో దాచిపెట్టినట్లు తెలిసింది. దీంతో ఈ అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ ఏటీఎస్ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఇందులో భారీగా పుత్తడి బయటపడింది. ఆ ఇంట్లో 88కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలోల పసిడి ఆభరణాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇల్లు గాంధీనగర్ లోని కలోల్ కు చెందిన వ్యక్తి పేరు మీద ఉందని.. అతను దానిని మహేంద్ర షా అనే స్టాక్ మార్కెట్ ఆపరేటర్ కు అద్దెకు ఇచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు
తెలిపారు.