- మంత్రుల పర్యటనలు.. శంకుస్థాపనలు
హుజూర్‌నగర్/మంథని (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. రేపు బుధవారం నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి… ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.8.28 కోట్ల వ్యయంతో గడ్డిపల్లి–యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రూ.70 లక్షలతో మల్లయ్యగూడెం రోడ్డు, రూ.3.15 కోట్లతో పొనుగోడు–అప్పన్నపేట రోడ్డు, రూ.50 లక్షలతో పొనుగోడు పాత బస్టాండ్–మెయిన్ రోడ్ బీటీ పనులు ప్రారంభించనున్నారు. పొనుగోడు ఊరచెరువులో చేప పిల్లల వదిలివేత కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు.
ఆ తరువాత రూ.18.96 కోట్లతో గరిడేపల్లి–అలింగాపురం రహదారి, పాలకవీడు మండలంలో రూ.1.8 కోట్లతో మూసి ఒడ్డుసింగారం–రోళ్లవారిగూడెం రహదారి, యల్లాపురంలో రూ.3.02 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్, రూ.3.50 కోట్లతో బెట్టెతండ–శూన్యపహాడ్ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం, మేళ్లచెరువులో రూ.3 కోట్లతో కోదాడ–రేవూరు రహదారి, ఫోర్లైన్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇక మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పర్యటనలో భాగంగా…. రూ.44 లక్షల వ్యయంతో నిర్మించిన సింథటిక్ షటిల్ కోర్టును ప్రారంభించనున్నారు. డ్రీమ్, స్టార్ట్, రైజ్ ఇన్నోవేషన్ కార్యాలయంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
పోచమ్మవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, అడవి సోమన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ పైలెట్ ప్రాజెక్ట్ కింద పూర్తయిన గృహాల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదనంగా రూ.3.05 కోట్లతో నూతన సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

