Defamation case | మంత్రి సురేఖ కు ఊరట !!
- పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్న నాగార్జున
- దాదాపు ఏడాది పాటు ఊగిసలాట…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసును ఉప సంహరించుకోవడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఊరట కలిగింది. అక్కినేని కుంటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వేసిన పరువు నష్టం దావాను ఈ రోజు అధికారికంగా ఉపసంహరించుకున్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ గత ఏడాది డిసెంబర్‌లో జరగ్గా.. ఇంకా… పరువు నష్టం దావా కేసు విచారణలోనే ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యల్లో నాగార్జున గానీ, ఆయన కుటుంబ సభ్యుల గానీ మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా నాగార్జున కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఈ రోజు అధికారికంగా ఉపసంహరించుకున్నారు.

