Odisha | మూఢనమ్మకాలకు దంపతులు బలి

Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒడిశాలో మూఢనమ్మకం మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ దంపతులను దారుణంగా హత్య చేసి, వారి మృతదేహాలను పాడుబడ్డ బావిలో పడేసిన ఘటన కేంఝర్ జిల్లాలో వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. హుల్లాబిహాలి గ్రామానికి చెందిన ఖగేశ్వర్ సోరేన్ (42), ఆయన భార్య టుని సోరేన్ (35) గత జూన్ 25 నుంచి కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి గ్రామానికి చెందిన ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో దంపతులను చేతబడి చేస్తున్నారనే అనుమానంతో హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాలను గ్రామ శివారులోని పాడుబడ్డ బావిలో పడేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.