CONG | ఐక్యతతోనే ‘హస్త’గతం!

CONG | ఐక్యతతోనే ‘హస్త’గతం!

హస్తం పార్టీ ఐక్యత చాటింది. భారీ విజయంతో భాగ్యనగరం నడిబొడ్డున విజయకేతనం ఎగురవేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంపిక మొదలు, సమన్వయంతో సాగిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో అలుపెరగక చేసిన కృషి అద్భుత విజయాన్ని అందించింది. బీఆర్ఎస్ కంచుకోటగా మారిందనుకున్న జూబ్లీ గడ్డపై బీసీ బిడ్డ సాధించిన విజయంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. ప్రతి ఒక్క కార్యకర్త చేసిన కృషికి నాయకుల తోడ్పాటు కలిసిరావడంతో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థుల కంటే ధీటుగా గ్రౌండ్ లెవల్ వర్క్ చేయడం ద్వారా హస్తం పార్టీ విజయం సాధించింది.

CONG | సమన్వయం భేష్..


కాంగ్రెస్ సక్సెస్ క్షేత్రస్థాయిలో సత్తాచాటిన కాంగీయులు
జూబ్లీహిల్స్ ఉపపోరు విజయంతో జోష్
సోషల్ మీడియా కంటే గ్రౌండ్ వర్క్ ముఖ్యం…నిరూపించిన నేతలు


ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జోష్ మీ దుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు ఉమ్మడి జిల్లాల్లో ఘన విజయాన్ని దక్కించుకొని అధికారం చేపట్టడం జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపినప్పటికీ, హైదరాబాద్ మహా నగరంలో మాత్రం ఖాతా తెరవలేక పోయింది. దీంతో హైదరాబాద్ మహానగరం నుంచి హస్తం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీ నుంచి దానం నాగేందర్, అరికెపూడి గాంధీలు హస్తం గూటికి చేరినప్పటికీ, పార్టీ ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి చేరిక, అనధికారికంగానే మిగిలిపోయింది.

CONG | ఒక్కతాటిపై నిలిచి..

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఐక్యతారాగం కనిపించడం శుభ పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు మొదలుకొని కిందిస్థాయి కార్యకర్తల వరకు అందరూ ఒక్కటిగా ముందుకు సాగి, విజయమే లక్ష్యంగా ముందుకు సాగిన తీరు ఆ పార్టీని విజయతీరాలకు చేర్చింది. ఉప్పు-నిప్పులా ఉన్న వర్గ పోరు కాస్త ఒక్కటిగా ముందుకు సాగింది. ప్రతి పోలింగ్ బూత్ ప్రమాణికంగా చేసుకొని క్షేత్ర స్థాయిలో వారు శ్రమించిన విధానం గులాబీ పార్టీకి చెక్ పెట్టి, కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించింది. దీంతో హైదరాబాద్ మహానగర నడిబొడ్డున జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం నేతలు పాగా వేయడంతో ఇక బల్దియా కూడా తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ వర్గాలు జోష్ మీదున్నాయి.

రేవంత్ మార్క్ ప్రచారంతో పాటు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూపంలో చక్కని సమన్వయకర్త దొరకడం ఆ పార్టీ విజయంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. మంత్రులంతా ఎవరికి వారే తమను తాము నిరూపించుకోవాలన్న తపనతో క్షేత్రస్థాయిలో పడిన కష్టమంతా ఓట్లుగా మారి, విజయాన్ని కట్టబెట్టిందని, కనీసం బస్తీల వారీగా కమిటీలు కూడా లేని కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యంగా ఉంటే విజయం తథ్యమని జూబ్లీహిల్స్ ఎన్నికలు రుజువు చేశాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచారం వరకు అందరూ ఏక తాటి పైకి వచ్చి, చెమటోడ్చిన కారణంగానే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు లక్ష ఓట్లను సంపాదించడమే కాక, సుమారు 25 వేల ఓట్ల మెజారిటీని సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కేవలం పక్కన లీడర్ కు పేరొస్తుందన్న కారణంగా పక్కలో బల్లెంగా మారుతున్న పరిస్థితుల కారణంగానే ఇంతకాలం ఆ పార్టీ ఓటమి పాలవుతూ వచ్చిందని వారు గుర్తుచేస్తున్నారు.

ముఖ్యంగా గ్రౌండ్ లెవల్లో ఆ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉందని, నాయకులు కూడా ఉన్నారని, కేవలం వర్గ పోరు, ఆధిపత్య భావజాలంతో మాత్రమే నష్టపోతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని, నవీన్ యాదవ్ తరహాలో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే, ఒక్కటై విజయం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే బల్దియా పీఠంపైనా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వారు పేర్కొంటున్నారు. మరి ఆ దిశగా కాంగ్రెస్ శ్రేణులు అడుగులు వేస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply