కూనంనేని వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

కూనంనేని వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

బీజేపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు: రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల రాజకీయ వైఖరి, ద్వంద్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. సొంతంగా, ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్న వారు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

వయసు పెరిగినా కమ్యూనిస్టు నాయకుల్లో రాజకీయ పరిపక్వత రాలేదని ఆయన విమర్శించారు. పదవుల కోసం మాత్రమే ప్రాకులాడే కమ్యూనిస్టులకు ఎక్కడా సొంతంగా గెలిచే సత్తా లేదని ఆరోపించారు. ఒకటి రెండు సీట్ల కోసం, రాజకీయ మనుగడను కాపాడుకోవడం కోసం ఇతర పార్టీలపై ఆధారపడుతున్నారని విమర్శించారు.
సీపీఐకి అధికార, పదవుల కోసం పొత్తు పెట్టుకోని పార్టీ లేదని దేవకి వాసుదేవరావు అన్నారు. కాంగ్రెస్‌తో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ను విమర్శించడం, బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను విమర్శించడం వారి రాజకీయ స్థిరత్వం లేమికి నిదర్శనమని పేర్కొన్నారు. సీపీఐ నాయకులకు నైతికత, సిద్ధాంతం లేవని తీవ్రంగా ధ్వజమెత్తారు.

కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలంగా రాజకీయంగా పోరాడుతున్న కమ్యూనిస్టులు, తెలంగాణలో మాత్రం అదే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎర్రజెండాను పక్కన పెట్టారని, ప్రజల్లో కమ్యూనిస్టులపై నమ్మకం తగ్గిపోయిందని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీసే నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని దేవకి వాసుదేవరావు హెచ్చరించారు. నైతికత లేని కూటములు, కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరిపై ప్రజలు తీర్పు ఇస్తారని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుద్ర ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి వీరభద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాయుడు రాఘవరావు, ప్రవీణ్, చిలుకూరి రమేష్, శ్యామ్ రాథోడ్, పమ్మి అనితతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply