అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను…

అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను…

ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్

ముధోల్, ఆంధ్రప్రభ : అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తానని ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ముధోల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమానికి ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు లబ్ధిదారుల ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదలకు సొంత ఇల్లు కలను నిజం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు. గృహప్రవేశం చేసిన కుటుంబాలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివాస సౌకర్యాలు మెరుగుపడుతున్నాయని, పేదల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలకు స్థిర నివాసం లభిస్తూ వారి జీవితం కొత్త దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

అనంతరం నూతనంగా నిర్మించిన దత్త మందిర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఆలయ పూజారులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ముధోల్ సర్పంచ్ షబానా ఏజాజ్ ఉద్దీన్, ముధోల్ బీడీసీ అధ్యక్షులు విఠల్, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్, ముధోల్ మండల అధ్యక్షుడు కోరిపోతన్న, బిజెపి నాయకులు మాజీ ఎంపీటీసీ దేవోజి భుమేష్, ఎంపిడిఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply