ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు (మార్చి 2) టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచుతో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 300వ మ్యాచ్‌ను ఆడనున్నాడు.
దీంతో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ వంటి ఎలైట్ ఇండియా స్టార్స్ జాబితాలో కోహ్లీ చేరనున్నాడు. ఇప్పటి వరకు 299 వన్డే మ్యాచులు 287 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ… 58.21 యావరేజ్ తో, 9.42 స్ట్రైక్ రేట్ తో 14,085 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఇక పాక్ పై సెంచరీ బాది తిరిగి ఫామ్ లోకి వచ్చిన కోహ్లిని.. న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లో పలు రికార్డులను ఊరిస్తున్నాయి.
3 వేల పరుగులు..
రేపటి మ్యాచ్‌లో కోహ్లీ మరో 85 పరుగులు చేస్తే… న్యూజిలాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 3000 పరుగులు పూర్తి చేసిన (భారత్ తరుఫున) రెండో బ్యాటర్ నిలుస్తాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 55 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ. 47.01 యావరేజ్ తో 2,915 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 15 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా, టీమిండియా తరఫున సచిన్ తెందుల్కర్ (3,345) ఒక్కడే ఈ మార్క్ ను అందుకున్నాడు.
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు
ఇక వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండుల్కర్ 1750 పరుగులు అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 1645 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 106 పరుగులు చేస్తే కోహ్లీ ఈ రికార్డును అధిగమిస్తాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల రికార్డు
న్యూజిలాండ్ పై మరో 52 పరుగులు చేస్తే.. శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు. విరాట్ కోహ్లీ – 15 మ్యాచ్‌ల్లో 651 పరుగులు సాధించాడు. శిఖర్ ధావన్ 10 మ్యాచ్‌లు ఆడి.. 701 పరుగులు నమోదు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో సౌరవ్ గంగూలీ 13 మ్యాచ్‌లు, 665 పరుగులతో ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగుల
విరాట్ కోహ్లీ 142 పరుగులు చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓవరాల్ గా.. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ 651 పరుగులతో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 791 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
తదుపరి స్థానాల్లో..
- మహేల జయవర్ధనే (శ్రీలంక) – 22 మ్యాచ్‌లు, 742 పరుగులు
- శిఖర్ ధావన్ (భారత్) – 10 మ్యాచ్‌లు, 701 పరుగులు
- కుమార సంగక్కర (శ్రీలంక)- 22 మ్యాచ్‌లు, 683 పరుగులు
- సౌరవ్ గంగూలీ (భారత్) – 13 మ్యాచ్‌లు, 665 పరుగులు
- జాక్వెస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా) – 17 మ్యాచ్‌లు, 653 పరుగులు
న్యూజిలండ్ పై ఎక్కువ సెంచరీలు.
వన్డేల్లో న్యూజిలండ్ పై ఎక్కువ సెంచరీలు బాదిన ప్లేయర్స్ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్.. సమానంగా 6 సెంచరీలతో ఉన్నారు. ఇప్పుడు విరాట్ మరో శతకం బాదితే వాళ్లని అధిగమిస్తాడు.
న్యూజిలండ్ పై ఎక్కువ హాఫ్ సెంచరీలు
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలండ్ పై ఎక్కువ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్స్ జాబితాలో శిఖర్ ధావన్, గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ.. సమానంగా 6 హాఫ్ సెంచరీలతో ఉన్నారు. ఇప్పుడు విరాట్ మరో అర్థ శతకం బాదితే వాళ్లని అధిగమిస్తాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 14,085 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో మరో 150 పరుగులు చేస్తే కుమార సంగక్కరను అధిగమించి రెండో స్థానంలో నిలుస్తాడు. సచిన్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, కుమార సంగక్కర 14,234 పరుగులతో ఉన్నారు.