విద్యార్థులు క్రీడల్లో రాణించి దివిసీమకు పేరు తేవాలి

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రీడల్లో రాణించి దివిసీమకు మంచిపేరు తేవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. సోమవారం అవనిగడ్డలోని ఇండోర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్ షిప్-2026 నియోజకవర్గ జట్ల ఎంపికను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు విశేష ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి కలిగిన క్రీడలో నైపుణ్యం పెంచుకుని ఎదగాలని పిలుపునిచ్చారు.

మూడు రోజులపాటు జరిగే ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ షటిల్ కోర్టు ఓపెన్ చేసి, షటిల్ ఆడి ప్రారంభించారు. సెలక్షన్లకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు.

అనంతరం ఆర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను వ్యాయామ ఉపాధ్యాయులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈఓలు అన్నపరెడ్డి పిచ్చయ్య, సనకా శ్రీకాంత్, అసోసియేషన్ అధ్యక్షులు బడే వెంకటేశ్వరరావు, కార్యదర్శి బీపీఎల్ ప్రసాద్, కోశాధికారి నవీన్, గరికపాటి మారుతీ, అప్పికట్ల రామారావు, తాతాజీ, మునగాల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.