- ఇక ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహణ… టీచర్ పోస్టుల భర్తీ
ఉండవల్లి/అమరావతి : ఏపీ విద్యా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్ర శిక్షాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ చరిత్రలోనే తొలిసారిగా 16,347 టీచర్ పోస్టులతో చేపట్టిన మెగా డీఎస్సీపై సమీక్ష జరిగింది. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “ఏడేళ్ల విరామం తర్వాత ఈ మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణం. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులకు అభినందనలు. ఇది ఏపీ విద్యా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం” అని తెలిపారు.
ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. టీచింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసం బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలను కూడా పకడ్బందీగా ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు నాలుగు వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు.
అక్షరాస్యత వృద్ధి కోసం ప్రాజెక్ట్ అ-ఆ (అక్షర ఆంధ్ర)ను మొదలుపెట్టినట్టు చెప్పారు. 100 శాతం అక్షరాస్యత లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.
“రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను మోడల్ ఎడ్యుకేషన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ముఖ్య లక్ష్యం” అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.