నాటుసారా అమ్మితే జైలే

నాటుసారా అమ్మితే జైలే
- జిల్లా ఎక్సైజ్ బాస్ రవికుమార్ అల్టిమేటం
నందికొట్కూరు, ఆంధ్రప్రభ:
“నాటుసారా అనేది చావు వ్యాపారం. దాన్ని వెంటనే వదిలేయండి. లేదంటే పీడీ యాక్ట్ (PD Act) కింద జైలుకు పంపిస్తాం” అని నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాదు రవికుమార్ నాటుసారా తయారీదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని సంగయ్యపేట రాయల్ ప్యాలస్ ఫంక్షన్ హాల్‌లో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రజలు తరతరాలుగా ఒకే అక్రమ వృత్తికి పరిమితం కావద్దని, నాటుసారా వంటి అనారోగ్యకర, చట్టవిరుద్ధ వ్యాపారాలను పూర్తిగా మానుకొని గౌరవప్రదమైన జీవనోపాధి వైపు రావాలని రవికుమార్ పిలుపునిచ్చారు. అక్రమ దందాల వల్ల పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో బతుకులను మార్చుకోవాలని సూచించారు.
సబ్సిడీ రుణాలు.. స్వయం ఉపాధి మార్గాలు:
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ పథకం కింద భారీగా సబ్సిడీ రుణాలు అందుబాటులో ఉన్నాయని, స్వయం ఉపాధి సాధించాలనుకునే వారికి బ్యాంకులు పూర్తి సహకారం అందిస్తాయని ఆయన తెలిపారు. చదువు లేకపోయినా లేదా కనీసం ఎనిమిదో తరగతి చదివినా చాలని, 5 నుండి 10 మంది మహిళలు లేదా పురుషులు ఒక సంఘంగా ఏర్పడితే చాలు లక్షల్లో రుణాలు వస్తాయన్నారు. విస్తరాకుల తయారీ, పచ్చళ్లు, వడియాలు వంటి కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో ప్లంబర్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, మేస్త్రి పనులకు విపరీతమైన డిమాండ్ ఉందని, యువత నైపుణ్య శిక్షణ (Skill Training) తీసుకుంటే తక్షణమే ఉద్యోగం గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే జూన్ నెలలో నందికొట్కూరులో ఒక భారీ జాబ్ మేళా నిర్వహించబోతున్నామని, నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోవద్దని కోరారు.
సమాచారం అందిస్తే వివరాలు గోప్యం:
జిల్లాలో ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయించినా, నాటుసారా తయారు చేస్తున్నా ప్రజలు వెంటనే 80085 36382 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎక్సైజ్ అధికారి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
ఈ వినూత్న అవగాహన సదస్సులో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి. రాముడు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రదీప్, పరిశ్రమల శాఖ అధికారి శివప్రసాద్, ఎన్‌కార్డ్ (NCORD) శాఖ అధికారి ఓబుల్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు. అలాగే నంద్యాల ఎక్సైజ్ సీఐ లక్ష్మణ దాసు, ఆత్మకూరు సీఐ మోహన్ రెడ్డి, నందికొట్కూరు సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐలు భాష్యం శ్రీనివాసులు, జగదీష్, మెప్మా ప్రతినిధి అర్చన తదితరులు పాల్గొన్నారు.
