Under-17 wrestling | ఆధార్ వెరిఫికేషన్‌తో రెజ్లర్లకు భారీ షాక్..

Under-17 wrestling | ఆధార్ వెరిఫికేషన్‌తో రెజ్లర్లకు భారీ షాక్..

  • ఏజ్ ఫ్రాడ్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ఉక్కుపాదం..
  • అండర్-17 జాతీయ టోర్నీలో బోగస్ సర్టిఫికెట్ల బండారం బట్టబయలు

(Under-17 wrestling) ఆంధ్రప్రభ : భారత రెజ్లింగ్‌లో వయసు మోసాల (ఏజ్ ఫ్రాడ్)పై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఉక్కుపాదం మోపింది. ఆధార్ ఆధారిత కఠిన ధృవీకరణ విధానాన్ని అమలు చేయడంతో అండర్-17 జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో 500 మందికి పైగా రెజ్లర్లు అనర్హతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జూన్ 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పోటీలకు దాదాపు 1,200 మంది రెజ్లర్లు ఎంట్రీలు పంపించారు. పురుషుల ఫ్రీస్టైల్, గ్రెకో-రోమన్, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

ఆధార్-జనన ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈసారి రెజ్లర్ల నుంచి కేవలం జనన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కాకుండా, మొబైల్ నంబర్‌కు అనుసంధానమైన ఆధార్ కార్డు, ఓటీపీ ఆధారిత ధ్రువీకరణను కూడా తప్పనిసరి చేశారు. ఆధార్‌లో నమోదు చేసిన వివరాలు, జనన ధ్రువీకరణ పత్రాల్లోని వివరాలను అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భారీగా వ్యత్యాసాలు బయటపడటంతో దాదాపు 500 మంది రెజ్లర్లను అనర్హులుగా ప్రకటించారు. వీరిలో సుమారు 300 మంది పురుషుల ఫ్రీస్టైల్ విభాగానికి, 125 మంది గ్రెకో-రోమన్ విభాగానికి, 50 మంది మహిళల విభాగానికి చెందినవారు ఉన్నారు.

ఒక్క కేసు కలకలం

ఒక రెజ్లర్ జనన ధ్రువీకరణ పత్రంలో 2007లో ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో జన్మించినట్లు ఉండగా, ఆధార్ రికార్డుల్లో మాత్రం 2004లో హర్యానాలో జన్మించినట్లు నమోదై ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో సంబంధిత ఆసుపత్రి నుంచి వివరణ కోరినట్లు అధికారులు తెలిపారు. పూర్తి ధ్రువీకరణ అనంతరం కేవలం 350 మంది పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లర్లు, 185 మంది మహిళా రెజ్లర్లు, 160 మంది గ్రెకో-రోమన్ రెజ్లర్లకు మాత్రమే పోటీల్లో పాల్గొనే అనుమతి లభించింది.

ఏజ్ ఫ్రాడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం..

ఈ సందర్భంగా డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ, వయసు మోసాల వల్ల నిజమైన క్రీడాకారులు నష్టపోతున్నారని అన్నారు. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా అనేక అక్రమాలు బయటపడ్డాయని, భవిష్యత్తులో జరిగే అండర్-15, అండర్-17, అండర్-20 పోటీలన్నింటిలోనూ ఇదే విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవలే నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఐదుగురు రెజ్లర్లను సస్పెండ్ చేసిన డబ్ల్యూఎఫ్‌ఐ, ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

Leave a Reply