Anaganaga Oka Raju | ఈ సినిమా అందరికీ నచ్చుతుంది..

Anaganaga Oka Raju | ఈ సినిమా అందరికీ నచ్చుతుంది..
Anaganaga Oka Raju | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించగా, శ్రీకర స్టూడియోస్ (Srikara Studious) సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. అసలుసిసలైన పండగ సినిమాగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను తెలియచేశారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
Anaganaga Oka Raju | పూర్తి కామెడీ పాత్రలో..
గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాలో (Movie) నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు.

Anaganaga Oka Raju | అది ఛాలెంజింగ్ గా అనిపించింది..
చారులత పాత్ర.. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ (Director) ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది. నవీన్ గారితో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు.

Anaganaga Oka Raju | మరచిపోలేని అనుభూతి..
గోదావరి ప్రాంతంలో సూటింగ్ మరచిపోలేని అనుభూతి ఇచ్చింది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి (Godhavari) ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.

Anaganaga Oka Raju | నాకు అదే ముఖ్యం..
నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను. తదుపరి ప్రాజెక్ట్ లు గురించి చెప్పాలంటే.. నాగ చైతన్య (Naga Chaitanya) గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.
