Central Govt | గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి

Central Govt | గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
- వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
- పేదల కడుపు నింపే ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు
- మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Central Govt | భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం(Central Govt) కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి …
రాబోయే మున్సిపల్(Municipal) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు.
ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు.
నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
