Nandyal Bureau | ఘనంగా ముక్కోటిఏకాదశి వేడుకలు..

Nandyal Bureau | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం ఘనంగా నిర్వహించాం అన్నారు కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు. ఈ సందర్భంగా వేకువజామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు. ఉదయం 3.00 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం 3.30 నిమిషాలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించామని చెప్పారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజలు జరిపించి గం.4.30!!లకు స్వామివారికి, తరువాత అమ్మవారికి మహామంగళ హారతులు జరిపించారు.

మహామంగళహారతుల తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపములో విశేష పూజాదికాలను జరిపించబడ్డాయన్నారు. ఈ పూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవసంకల్పాన్ని పఠించారు. ఈ ఉత్సవ సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రమాదాలు, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని చెప్పబడిందన్నారు.

Nandyal Bureau |

అనంతరం ఉత్సవపూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాదికాలు జరిపించబడ్డాయన్నారు. తరువాత ఈ ఉత్సవంలో భాగంగానే ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తోడ్కొని వచ్చి ఆలయ ఉత్తరభాగంలోనే రావణవాహనం పై ఆశీనులను చేయించి రావణవాహనసేవ జరిపించబడింది. తరువాత రావణవాహనం పై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపించారు.

ప్రతీ ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన తూర్పుద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళే స్వామి అమ్మవార్లు సంవత్సరంలో రెండు పర్యాయాలు మాత్రమే ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్ళడం విశేషం. ముక్కోటి ఏకాదశి రోజున శివముక్కోటి రోజున (వార్షిక ఆరుద్రోత్సవం రోజున) ఈ విధంగా శ్రీస్వామిఅమ్మవార్లు ఆలయ ఉత్తరద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలివెళ్తారు. కాగా గ్రామోత్సవం తరువాత కూడా భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) వేంచేబు చేయించడం జరిగింది.

Nandyal Bureau |

శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించడం జరిగింది. ఈ ఉత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, శ్రీస్వామివార్ల ప్రధానార్చకులు కె.శివప్రసాద్‌స్వామి, స్థానాచార్యులు ( అధ్యాపక) ఎం. పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధకృష్ణశర్మ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply