ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

  • గెజిట్‌ జారీ

ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ (సోమ‌వారం) నుండి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, సాగునీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

డిసెంబర్ 29న ప్రారంభమయ్యే ఈ సభ, నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు మూడు రోజుల పాటు విరామం తీసుకుంటుంది. అనంతరం జనవరి 2, 2026 నుండి సమావేశాలు నిరంతరాయంగా కొనసాగుతాయని ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

సాగునీటి యుద్ధం..

ఈ సారి అసెంబ్లీలో ప్రధాన అజెండా సాగునీటి ప్రాజెక్టులే కానున్నట్టు తెలుస్తొంది. ‘నీళ్లు-నిజాలు’ పేరుతో ప్రభుత్వం కీలకమైన శ్వేతపత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై విస్తృత చర్చ జరగనుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంపై రేవంత్ సర్కార్ తన వాదనను బలంగా వినిపించనుంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని, గత ప్రభుత్వ హయాంలో డీపీఆర్‌లు (DPR) ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో ప్రజలకు వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేసీఆర్‌కు బహిరంగ సవాల్..

ఈ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేవలం ప్రెస్ మీట్లు, పార్టీ ఆఫీసులకు పరిమితం కాకుండా, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు. “నీళ్లా.. నిధులా.. నియామకాలా.. లేక సంక్షేమ పథకాలా? ఆప్షన్ మీదే.. ఏ అంశంపై అయినా ముఖాముఖి తేల్చుకుందాం రండి” అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్‌ను ఎలాగైనా సభకు రప్పించి, అక్కడే పాత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నది రేవంత్ గేమ్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

స్థానిక సంస్థలు, 42 శాతం బీసీ రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల పెంపు ఈ సమావేశాల్లో మరో హాట్ టాపిక్‌గా మారనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంపై అధికార పార్టీ విశ్లేషణ చేయడంతో పాటు, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యూహాలపై చర్చించనుంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసే అవకాశం ఉంది.

జీహెచ్‌ఎంసీ విభజన..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని పెంచుతూ, నగరాన్ని మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ లేదా బిల్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే పీఏసీఎస్ (PACS) ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టుల నిర్వహణ లోపాలను ఎండగడుతూ, ప్రతిపక్ష బిఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన టీమ్‌ను సిద్ధం చేసింది. మొత్తానికి ఈ శీతాకాల సమావేశాలు ఉభయ పక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply