Sangareddy | ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు…

Sangareddy | ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు…
మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ పి.ప్రావీణ్య
Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 28 (ఆంధ్రప్రభ): ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య (P. Praveenya) హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ లోని డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
ఈసందర్బంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ…. పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించి, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి (Election Code of Conduct) అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు, డీపీఆర్వో విజయలక్ష్మి, అదనపు పీఆర్వో ఏడుకొండలు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, మీడియా ప్రతినిధులు, డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
