పుడ్ పాయిజన్ నిజమే

- ఎస్‌ఆర్‌ఎం వర్శిటీలో 300 మంది విద్యార్థులకు అస్వస్థత
- రంగంలోకి అధికార బృందం
ఆంధ్రప్రభ, మంగళగిరి రూరల్ : ఆంధ్రప్రభ అక్షరం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతతో అల్లాడుతున్న వైనంపై గురువారం ఆంధ్రప్రభ లో ‘నిత్యకృత్యంగా పుడ్ పాయిజన్’ శీర్షికతో ప్రచురితం అయిన కథనంపై స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. ఫీజుల రూపంలో విద్యార్థులు లక్షలు చెల్లిస్తున్నా నాణ్యమైన ఫుడ్ ఎందుకు అందించక పోవడంపై కన్నెర్ర చేశారు.
వెంటనే యూనివర్శిటీని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించాలని తెనాలి సబ్ కలెక్టర్, వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖాధికారులు, పుడ్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. వర్శిటీని సందర్శించిన జిల్లా అధికారుల బృందంకు దిగ్భ్రాంతిని కలిగించే నిజాలు కనిపించాయి. వందలాది మంది భోజనం చేసే మెస్‌లో నాణ్యమైన సరుకులను వాడటం లేదని, ప్రైవేటు ఏజెన్సీ వాళ్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల బృందం ఎదుట వాపోయారు.
సబ్ కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
నాణ్యమైన భోజనం లేకపోవడం వల్ల ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో వందలాది మంది విద్యార్థులకు పుడ్ పాయిజన్ అయి, అసుపత్రుల్లో అల్లాడుతున్న వైనంపై ఆంధ్రప్ర¿¶ లో వచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రైవేటు వర్శిటీ ఎస్‌ఆర్‌ఎం లో జరుగుతున్న ఆహారం దోపిడిని అక్షరరూపం ఇచ్చిన కథనంతో జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించారు. వర్శిటీలో అసలు ఏం జరుగుతుందని అధికారులను అడిగి ఆరా తీశారు. వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనలో తలమునకలై ఉన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసిన్హా ఆధ్వర్యంలో అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక డీఎస్పీ, విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి, పుడ్ ఇన్సపెక్టర్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. వర్శిటీని సందర్శించి మెస్‌లు, పరిసరాలు, తాగునీరు, వాడుతున్న నీరు, మురుగునీటి పారుదల వంటి అన్ని విభాగాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారుల బృందాన్ని ఆదేశించారు. దీంతో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కమిటీ సభ్యులతో కలిసి గురువారం నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం వర్శిటీని సందర్శించారు. పుడ్ పాయిజన్‌పై విచారణ చేపట్టారు.
వందల మందికి పుడ్ పాయిజన్
అధికారుల బృందం నేరుగా ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలోని మెస్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడారు. పత్రికలో కథనం రావడంతో అప్రమత్తమైన వర్శిటీ అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రాథమిక చికిత్స అనంతరం వారి స్వగృహాలకు పంపించివేశారు. దీంతో కొందరితోనే అధికారుల బృందం విచారణ చేసింది.
300 మందికి పైగా విద్యార్థులు పుడ్ పాయిజన్‌కు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇంతమంది అనారోగ్యంకు గురికావడంకు ప్రధాన కారణం నాణ్యతలేని ఆహారమేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. తనిఖీలు చేస్తున్నామని, పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మీడియాకు తెలిపారు.
పుడ్ పాయిజన్ నిజమే…: సబ్ కలెక్టర్ సంజనాసిన్హా
ఎస్‌ఆర్‌ఎం వర్శిటీలో తనిఖీలు తర్వాత అధికారుల బృందం మంగళగిరికి చేరుకుంది. ఆసుపత్రుల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం మంగళగిరి తహసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనాసిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు విచారణలో వెళ్లడైందన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై వాస్తవాలను నిర్ధారించి, చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా కలెక్టర్ ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు.
అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో కొంత మందికి డయేరియా లక్షణాలు, మరికొందరికి వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి ఉన్నట్లు వైద్య బృందాలు నిర్ధారించినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణం ఏమిటి అన్నది ఖచ్చితంగా తెలుసుకునేందుకు పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన సమస్య తలెత్తిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. ఆహారం వండేందుకు వినియోగిస్తున్న నీరు, త్రాగు నీరు శాంపిల్స్ ను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు.
వీటిలో ఎక్కడ లోపం తలెత్తిందో గుర్తించే పనిలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారని ఆమె పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అన్నారు. పూర్తి నివేదిక అందిన తర్వాత వర్శిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
