విద్యుదాఘాతంతో యూపీ వాసి మృతి

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న ఉరుసు మేళా బుధవారం విషాద ఛాయలు మోసుకొచ్చింది. బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వచ్చిన రియాజ్‌ (25) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

ఉర్సు ఉత్సవాల సందర్భంగా రియాజ్‌ అరేక్‌ మాల్‌ అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. తన షాపులో విద్యుత్‌ సదుపాయం కోసం పక్క దుకాణం నుండి వైరును కలిపి ఉపయోగిస్తున్నాడు. అయితే, జాయింట్‌ వద్ద ఇన్సులేషన్‌ టేప్‌ బదులు ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టడంతో ప్రమాదం జరిగింది.

బుధవారం కురిసిన భారీ వర్షంతో వర్షపు నీరు ప్లాస్టిక్‌ కవర్‌లోకి చేరి, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దీంతో దుకాణంలో ఏర్పాటు చేసిన ఇనుప ర్యాక్‌లకు విద్యుత్‌ సరఫరా చేరింది. రియాజ్‌ ర్యాక్‌ను తాకడంతో అక్కడికక్కడే కరెంట్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply