శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదం.. చిరుతపులి మృతి
మన్ననూరు-శ్రీశైలం మార్గంలో ఘటన.. దర్యాప్తు చేపట్టిన అటవీ అధికారులు
అమ్రాబాద్, ఆంధ్రప్రభ: నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులి కూన మృతి చెందింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి వేళల్లో విధుల్లో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురువయ్య, గీత తమ సిబ్బందితో కలిసి మన్ననూరు-శ్రీశైలం హైవేపై గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన చిరుతపులి కూనను గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ డివిజన్, మన్ననూరు రేంజ్ పరిధిలోని మన్ననూరు సెక్షన్, గుండం ఈ బీట్, కంపార్ట్మెంట్ నంబర్ 331 వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
అధికారులు వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం మృతదేహాన్ని సురక్షితంగా భద్రపరిచినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ, శవపరీక్ష కోసం అధికారిక బృందాలను ఏర్పాటు చేశారు. సోమవారం సంబంధిత పశువైద్యాధికారులు, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అధికార ప్రతినిధి సమక్షంలో శవపరీక్ష నిర్వహించి, చిరుతపులి మృతికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
