రైతు భరోసా కోసం ఎదురుచూపు.. అసెంబ్లీలో కీలక చర్చకు అవకాశం

ఖరీఫ్‌ కష్టాలు.. పొగాకు సంక్షోభం
ఎల్నినో ప్రభావంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం
రైతు భరోసా.. మాటల్లోనా, చేతల్లోనా?
ఆక్వా రంగానికీ అండ ఏ మేరకు?
వసతి గృహాలపై కూడా ప్రజాప్రతినిధుల దృష్టి?

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇప్పుడు అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తుందా.. ఖరీఫ్‌ ప్రారంభం నుంచీ రైతులను వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, పంటల సాగుపై అనిశ్చితి, ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వ సూచనలు.. వీటన్నింటికీ సభలో సమాధానాలు కోరే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రజాప్రతినిధుల గళం ఎలా వినిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్నినో పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు అవుతోంది.. ఎక్కడ పంటలు దెబ్బతింటున్నాయి.. వరికి బదులుగా ఏ ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం సూచిస్తోంది.. విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందుబాటులో ఉన్నాయా…అనే ప్రశ్నలకు ప్రభుత్వం సభలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పొగాకు రైతుల సమస్య మరో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. గిట్టుబాటు ధర లేకపోవడం, కొనుగోళ్లలో ఇబ్బందులు, పంట తిరస్కరణ, మార్కెట్లో అనిశ్చితి రైతులను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. గతంలో ప్రభుత్వం కనీసం కిలోకు రూ.200 ధర వచ్చేలా చూడాలని కంపెనీలకు సూచించడంతో పాటు కేంద్రంతోనూ చర్చించాలని నిర్ణయించింది. ఉత్పత్తి పెరిగిందన్న కారణంతో ధరలు తగ్గించడం లేదా కొనుగోళ్లను పరిమితం చేయడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది.

రైతు భరోసా.. మాటల్లోనా, చేతల్లోనా?

మొత్తంగా ఈ సమావేశాల్లో వ్యవసాయంపై జరిగే చర్చకు ఒకే కేంద్రబిందువు ఉండనుంది. సంక్షోభంలో ఉన్న రైతుకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏమిటి… వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్న రైతు.. పంట ధర కోసం మార్కెట్‌ వైపు చూస్తున్న రైతు.. రాయితీల కోసం ప్రభుత్వ కార్యాలయాల వైపు చూస్తున్న రైతు.. ఈ మూడు ఎదురుచూపులకు అసెంబ్లీ నుంచి సమాధానం వస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ఖరీఫ్‌ పరిస్థితులపై వాస్తవ గణాంకాలు, పంటల వారీగా నష్టాల అంచనా, ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ, పొగాకు – ఆక్వా రైతులకు మార్కెట్‌ భరోసా, వసతి గృహాల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణపై ప్రభుత్వం ఏమి చెబుతుందన్నది చూడాలి. రైతు సమస్యలపై చర్చ జరిగిందా అన్నది మాత్రమే కాదు.. ఆ చర్చ నుంచి రైతుకు ఏ నిర్ణయం, ఏ భరోసా లభించిందన్నదే ఈ సమావేశాల అసలు పరీక్ష.

అయితే రైతుల దృష్టిలో అసలు ప్రశ్న హామీలు అమల్లోకి వచ్చాయా.. కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయా.. ధరల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.. అన్నదే. ఈ అంశంపై సభ్యుల మధ్య వాడీవేడీ చర్చకు అవకాశం ఉంది.

ఆక్వా రంగానికీ అండ ఏ మేరకు?

వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలకమైన ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా సభలో చర్చకు అవకాశం ఉంది. విద్యుత్‌ రాయితీలు, మేత ధరలు, మార్కెట్‌ ధరలు, ఎగుమతుల పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ్యులు ప్రశ్నించే అవకాశముంది. 2026-27లో ఆక్వాకల్చర్‌కు సంబంధించిన విద్యుత్‌ సబ్సిడీ అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గం కూడా పరిశీలించింది.

వసతి గృహాలపై కూడా ప్రజాప్రతినిధుల దృష్టి?

వ్యవసాయంతో పాటు సంక్షేమ వసతి గృహాల పరిస్థితులపైనా సభ్యులు గళం విప్పే అవకాశం ఉంది. వసతి గృహాల్లో ఆహారం నాణ్యత, మెనూ అమలు, తాగునీరు, పారిశుధ్యం, పడకలు, భవనాల పరిస్థితి, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు వంటి సమస్యలు ప్రస్తావనకు రావచ్చు. ప్రభుత్వం ఆధునికీకరించిన కొన్ని సామాజిక సంక్షేమ వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు, నిర్ణీత మెనూ, సీసీ కెమెరాలు, విద్యార్థులకు అవసరమైన వస్తువులు, ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ ప్రకటనలకూ క్షేత్రస్థాయి వాస్తవాలకూ మధ్య ఉన్న అంతరాన్ని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది.