జెన్‌ జీ చదువరులుగా.. పుస్తక పఠనానికి కొత్త ఊపు

పుస్తక పఠనాన్ని వేడుకగా మార్చిన జెన్‌ జీ
డిజిటల్‌ విముక్తి కోసం పుస్తకాల వైపు
పఠన శైలిలో మార్పు.. కొత్త పద్ధతుల్లో చదువు
లైబ్రరీలు, బుక్‌స్టోర్లకు పెరుగుతున్న ఆదరణ

ఒకప్పుడు పుస్తకం చదవడం అంటే ఒంటరిగా కూర్చోవడం. కానీ జెన్‌ జీ దీన్ని ఒక వేడుకగా మార్చుకుందని నిపుణులు చెబుతున్నారు. పఠనాన్ని ఒక సామాజిక కార్యకలాపంగా చేసి.. అందరూ కలిసి చదువుకునే సైలెంట్‌ రీడింగ్‌ పార్టీలుగా చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. పఠనంతోపాటు ఒక సమూహాన్ని ఏర్పర్చుకోవడాన్ని ఆస్వాదిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

చిన్ననాటి నుంచి ఇంటర్నెట్‌ వాతావరణంలో పెరిగిన మొదటి తరం జెన్‌ జీకి టెక్నాలజీ వీరికి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం వీరంతా పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం డిజిటల్‌ విముక్తి కలగటమే కారణమని అంటున్నారు. ఒకరకంగా డిజిటల్‌ స్క్రీన్‌లకు బానిసలుగా మారుతున్న తరుణంలో వీరంతా ప్రశాంతతను వెతుక్కునేందుకు పుస్తకాలను చదవడానికే ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఎందుకంటే పుస్తకాలు నోటిఫికేషన్లతో విసిగించవు. యూజర్ల డేటాను ట్రాక్‌ చేయలేవని అంటున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఉద్యమాలతో దేశాన్ని కుదిపేసిన జెన్‌ జీ అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నది. తన రూటే సెపరేటు అని చాటి చెబుతున్న తీరు పరిశీలకులను విస్మయానికి గురిచేస్తున్నది. కంప్యూటర్‌ కాలంలో జన్మించిన వీరు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌, టెక్నాలజీల మధ్య పెరిగినప్పటికీ.. తామంటూ ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు. నిత్యం సరికొత్తగా ఉంటూ.. ట్రెండింగ్‌లోకి వెళ్లాలనే ఆలోచనా ధోరణితో ఉంటారు. అయితే ఇలాంటి జెన్‌ జీలపై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఆందోళన వ్యక్తం చేశాయి. కారణం నేటి యువత పుస్తక పఠనాన్ని పూర్తిగా మర్చిపోతోందని, వీరిలో చదివే అలవాటు క్రమంగా క్షీణిస్తోందంటూ.. సోషల్‌ మీడియా, ఏఐనే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించాయి. అయితే, వీటిలో ఎలాంటి వాస్తవం లేదని పోర్ట్‌లాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల నివేదిక స్పష్టం చేసింది. జెన్‌ జీ చదవడం మర్చిపోలేదని.. దానికి కొత్త జీవం పోస్తున్నారని వారి అధ్యయనంలో వెల్లడవడం విశేషం.

పఠన శైలిలో మార్పు…

నేటి యువత ప్రింట్‌ నుంచి డిజిటల్‌ వరకు కొత్త పద్ధతుల్లో చదివేందుకు ఆసక్తి చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒకే పుస్తకాన్ని ముద్రిత ప్రతి, ఈ-బుక్‌, ఆడియో బుక్‌ ఇలా వివిధ రూపాల్లో చదువుతున్నారని అధ్యయనాల్లో తేలింది. వాట్‌ప్యాడ్‌, వెబ్‌టూన్‌, డీసీ యూనివర్స్‌, మార్వెల్‌ కామిక్స్‌ లాంటి డిజిటల్‌ వేదికలపై ఎక్కువ సమయం గడుపుతున్నారని, బుక్‌టాక్‌ పేరుతో పుస్తకాల ఫొటోలు, వాటి విశ్లేషణలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారని నిపుణులు వివరిస్తున్నారు. అదే విధంగా స్నేహితులకు పుస్తకాలను చదువుకునేందుకు, బహుమతులుగా ఇస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారని చెబుతున్నారు. ముద్రిత పుస్తకాలను చదివే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, కొన్ని సర్వేల ప్రకారం 2022లో వీరి వాటా 59 శాతం ఉండగా, ప్రస్తుతం 65 శాతంగా ఉందంటున్నారు. తెలంగాణలోనూ ఈ వాటా పెరగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు.

లైబ్రరీలు, బుక్‌స్టోర్లకు ఆదరణ…

ఆన్‌లైన్లో కంటే బుక్‌స్టోర్ల నుంచే పుస్తకాలు కొనేందుకు జెన్‌ జీ ఎక్కువ మొగ్గు చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక సర్వే ప్రకారం దేశంలో ఐదేళ్లలో బుక్‌స్టార్ల సంఖ్య 70 శాతం పెరిగిందని సమాచారం. దీంతోపాటు లైబ్రరీకి వెళ్లేవారి సంఖ్య, లైబ్రేరియన్ల సలహాలు తీసుకుని కొత్త పుస్తకాలు కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరో సర్వే ప్రకారం.. లైబ్రరీలకు వెళ్లే యువతలో ఒంటరితనంతో బాధపడటం తక్కువగా ఉన్నట్లు తేలిందట.