ఉద్యోగులారా మేల్కొండి.. ఉద్యమానికి సిద్ధం కండి!

  • ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు..
  • ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ శంఖారావం పూరించిన ఏపీజేఏసీ అమరావతి

విజయవాడ, ఆంధ్రప్రభ : ఉద్యోగుల న్యాయమైన హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, ఆత్మగౌరవం, భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కొనసాగిస్తున్న జాప్యాన్ని ఇక ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి, అదే రోజు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్‌, ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం చైర్‌పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రూ.40 వేల కోట్ల బకాయిలు…

బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర భృతి, డీఏలు, పీఆర్సీ తదితర అంశాలను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో పరిష్కారం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత రెండేళ్లలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ అడగడం లేదని, తమకు రావాల్సిన న్యాయమైన హక్కులనే కోరుతున్నారని చెప్పారు. ఉద్యోగులకు చెల్లించిన బకాయిల్లో అధిక భాగం ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్న సొమ్మేనని, అలాంటి తమ సొమ్మును తిరిగి అడిగే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు సరికావని బొప్పరాజు పేర్కొన్నారు.

‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అంటే ఇదేనా?..

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ బొప్పరాజు ప్రశ్నలు సంధించారు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించకపోవడం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటమేనా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత స్పష్టతతో వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమానికి ప్రభుత్వమే కారణం: దామోదరరావు…

ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తూ ఉద్యమానికి ప్రేరేపిస్తోందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, పదేపదే కాలయాపన చేయడం వల్ల ఉద్యోగులు ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము చేపట్టబోయే పోరాటం ఉద్యోగుల న్యాయమైన హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్ తరాల ప్రయోజనాల పరిరక్షణ కోసం జరిగే ప్రజాస్వామ్య ఉద్యమమని స్పష్టం చేశారు.

28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు..

ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గతంలో వాయిదా వేసిన ఉద్యమ కార్యాచరణను ఇక మరింత ఐక్యంగా, ఉధృతంగా కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల సన్నద్ధ సభలకు బదులుగా నేరుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

ఏపీజేఏసీ అమరావతి పురుషుల, మహిళా విభాగాలకు చెందిన రాష్ట్ర, జోనల్, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సులో ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, ప్రభుత్వ వైఖరిని సమీక్షించడంతో పాటు ఉద్యమ శంఖారావం పూరించనున్నట్లు ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ టి.వి. ఫణిపేర్రాజు తెలిపారు. అదే రోజు ఉద్యమ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఉద్యోగ, పెన్షనర్ సంఘాలను కలుపుకునే యోచన..

సదస్సులో తీసుకునే తీర్మానాల మేరకు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కోసం కలిసి వచ్చే అన్ని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలను సంప్రదించి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించడం అవసరమని నాయకులు పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం పోరాడటం ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు.

‘భవిష్యత్ తరాల కోసం పోరాటం’..

ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు. ప్రస్తుత తరంలో తమ హక్కుల కోసం నిలబడకపోతే భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఉద్యమం ప్రారంభమైతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు. ఉద్యమం కారణంగా భవిష్యత్‌లో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. కిషోర్ కుమార్, పబ్లిసిటీ సెక్రటరీ ఆర్. శ్రీనివాసరావు, కో-చైర్మన్లు చెవ్వూరి రవి, సంసాని శ్రీనివాసరావు, ఎస్. మల్లేశ్వరరావు, పి.వి.ఎన్. శాస్త్రి, జి. శివానందరెడ్డి, వైస్ చైర్మన్లు డా.టి. జయప్రకాశ్‌, ఎ. కుమార్‌రెడ్డి, కె. వెంకటేశ్వరరావు, కార్యదర్శులు వేల్పుల అరలయ్య, కె. చంద్రశేఖర్‌, కోన ఆంజనేయకుమార్‌, జె.వి. అనుదీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగం నుంచి చైర్‌పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, అసోసియేట్ చైర్‌పర్సన్ శివకుమారి రెడ్డి, కోశాధికారి సాయి లక్ష్మితో పాటు వివిధ జోన్ల ఇన్‌చార్జిలు, ఉద్యమ కార్యాచరణ కమిటీ సభ్యులు, క్యాపిటల్ సిటీ ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.