Raksha Bandhan | ఈ సైబర్ మోసాలపై జాగ్రత్త
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రక్షాబంధన్ వచ్చేస్తోంది. అన్నాచెల్లెళ్లు, అక్కతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా ఈ పండగకి రాఖీలు, గిఫ్ట్ అందిస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లోచ లేదా విదేశాల్లో లేకా దూరంగా ఉన్న తమ వారికి రాఖీలు, గిఫ్ట్ లు కొనడానికి, పంపడానికి చాలామంది ఆన్లైన్ షాపింగ్ వైపే మెగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా భావించిన సైబర్ మోసగాళ్లు.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీ గిఫ్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ డెలివరీ పేరుతో కొత్త స్కామ్లక తెరలేపుతున్నారు. మీ డబ్బుతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా కొల్లగొట్టేలా సైబర్ మోసగాళ్లు కూడా కొత్త ఎత్తుగడలతో సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
అసలు రక్షాబంధన్ సందర్భంగా ఎలాంటి సైబర్ మోసాలు జరుగుతున్నాయి? నకిలీ షాపింగ్ వెబ్‌సైట్‌ను ఎలా గుర్తించాలి? సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్లను నమ్మవచ్చా? రాఖీ లేదా బహుమతి ఆర్డర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పార్శిల్‌ను సురక్షితంగా ఎలా ట్రాక్ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండగ టైం చూసి మోసాలకు తెర..
ఇప్పుడు పండగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరుగుతుంది. రాఖీలు, బహుమతులు, స్వీట్లు త్వరగా పంపించాలనే ఆత్రుతలో చాలామంది అమ్మే వారి వివరాలు, వెబ్సైట్ అసలు సరైనదేనా.. కాదా అని కనీసం చూడకుండా ఆర్డర్లు చేస్తుంటారు. ఇదే సైబర్ మోసగాళ్లకి అదును… అంతే భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు, పరిమిత కాల ఆఫర్లు, ఎక్స్‌ప్రెస్ డెలివరీ వంటి ఆకర్షణీయమైన యాడ్స్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి నకిలీ వెబ్సైట్లకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఆర్డర్ పేరుతో డబ్బులు తీసుకుని వస్తువులు పంపకుండా మోసం చేస్తున్నారు.
మరికొందరు బ్రాండెడ్ సంస్థల పేరును ఉపయోగించి అలాంటి పేరుతోనే నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి నమ్మకం కలిగిస్తున్నారు. యూపీఐ, QR కోడ్లు, చెల్లింపు లింకులను ఉపయోగించి కూడా నకిలీ చెల్లింపు అభ్యర్థనలు పంపుతున్నారు.
రాఖీ నుంచి గిఫ్ట్ వరకు..
నిజమైన ఆన్లైన్ షాపింగ్ సంస్థల మాదిరిగానే కనిపించే నకిలీ వెబ్సైట్లను మొదట మోసగాళ్లు సృష్టిస్తారు. తరువాత రాఖీలు, బహుమతులు, స్వీట్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తారు. ఇక ఆర్డర్ చేసి డబ్బులు కూడా చెల్లించిన తర్వాత మనం తీసుకున్న వస్తువులు డెలివరీ కాకపోవచ్చు. అంతే కాదండోయ్.. మళ్లీ రీఫండ్ పేరిటా మరోసారి మోసం చేసే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ గిఫ్ట్ స్కామ్..
“రక్షాబంధన్ సందర్భంగా మీకు బహుమతి వచ్చింది”, “మీ రాఖీ గిఫ్ట్‌ను స్వీకరించండి” అంటూ వాట్సాప్‌లో సందేశాలుపై అప్రమత్తంగా ఉండాలి. ఆ సందేశంతో పాటు వచ్చే లింక్‌ను క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్లడం లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నాలు జరగవచ్చు.
నకిలీ కొరియర్ మోసం..
మీరు పంపించిన రాఖీ లేదా బహుమతి పార్శిల్ పేరుతో మోసగాళ్లు ఫోన్ లేదా సందేశం పంపవచ్చు. చిరునామా తప్పుగా ఉందని, అదనపు డెలివరీ ఛార్జీ చెల్లించాలని, పార్శిల్ నిలిచిపోయిందని చెబుతూ లింకులు పంపుతారు. మరికొందరు ఓటీపీ లేదా బ్యాంకు వివరాలు అడుగుతారు. ఇలా లేపి పోనొ లింకులు, ఓటీపీ బ్యాంక్ వివరాలు షేర్ చేయడం ద్వారా మీ ఖాతలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
క్యాష్‌బ్యాక్ మోసం
పండుగ సందర్భంగా క్యాష్‌బ్యాక్ లేదా ప్రత్యేక బహుమతి వచ్చిందంటూ నమ్మిస్తారు. దాన్ని పొందేందుకు QR కోడ్ స్కాన్ చేయాలని లేదా యూపీఐ ద్వారా డబ్బు పంపాలని అభ్యర్థనను ఆమోదించాలని చెబుతారు. క్యాష్‌బ్యాక్ వస్తుందని భావించి అభ్యర్థనను ఆమోదిస్తే, మీ ఖాతా నుంచి డబ్బు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇందుకోసం నకిలీ కస్టమర్ కేర్ ల నుంచి ఆర్డర్ రద్దు, రీఫండ్ లేదా డెలివరీ సమస్య పరిష్కారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.
రీఫండ్ మోసం..
ఆర్డర్ రద్దు లేదా రీఫండ్ పేరుతో మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. డబ్బు తిరిగి రావాలంటే ఒక యాప్‌ను ఇన్స్టాల్ చేయాలని, స్క్రీన్‌ను పంచుకోవాలని లేదా యూపీఐ చెల్లింపు అభ్యర్థనను ఆమోదించాలని చెబుతారు. వాళ్ల చెప్పినట్లు చేస్తే వెంటనే ఖాతా నుంచి డబ్బు మాయం కావచ్చు.
నకిలీ వెబ్‌సైట్‌ను ఎలా గుర్తించాలి?
ఆన్లైన్లో రాఖీ లేదా బహుమతి ఆర్డర్ చేసే ముందు వెబ్సైట్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలి. అసాధారణంగా భారీ డిస్కౌంట్లు, అనుమానాస్పద వెబ్సైట్ చిరునామా, స్పష్టమైన రిటర్న్ పాలసీ లేకపోవడం, సంప్రదింపు వివరాలు సరిగా లేకపోవడం వంటి అంశాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. వెబ్సైట్లో ఉన్న సమీక్షలు, రేటింగ్‌లు మాత్రమే నమ్మకుండా ఇతర విశ్వసనీయ వనరుల ద్వారా కూడా సంస్థ గురించి తెలుసుకోవడం మంచిది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనల నుంచి నేరుగా కొనుగోలు చేసే ముందు మరింత జాగ్రత్త అవసరం.
సోషల్ మీడియాలో ప్రకటనలు నమ్మవచ్చా?
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటన నిజమైనదని భావించకూడదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో కూడా మోసగాళ్లు నకిలీ షాపింగ్ ప్రకటనలు నిర్వహిస్తున్నారు. భారీ తగ్గింపులు, పరిమిత కాల ఆఫర్లు, ఉచిత బహుమతులు, వేగవంతమైన డెలివరీ వంటి మాటలతో వినియోగదారులను ఆకర్షిస్తారు. అందువల్ల ప్రకటనపై కనిపించే లింక్‌ను నేరుగా తెరవడం కంటే, సంబంధిత సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక అనువర్తనం ద్వారా ఆఫర్‌ను పరిశీలించడం సురక్షితం.
ఆన్లైన్లో రాఖీ కొనుగోలు చేసేటప్పుడు ఏం చేయాలి?
రాఖీ లేదా బహుమతి కొనుగోలు చేసే ముందు వెబ్సైట్ విశ్వసనీయతను పరిశీలించాలి. వివరాలు, కస్టమర్ల సమీక్షలు, రేటింగ్‌లు, రిటర్న్ విధానం, డెలివరీ ఛార్జీలు, డెలివరీ సమయం వంటి వివరాలను ముందుగానే తెలుసుకోవాలి. తెలియని లింకుల ద్వారా చెల్లింపులు చేయకూడదు. యూపీఐ పిన్ను ఎవరితోనూ పంచుకోకూడదు. డబ్బు స్వీకరించడానికి యూపీఐ పిన్ అవసరం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద QR కోడ్లు, చెల్లింపు అభ్యర్థనలను ఆమోదించకూడదు.
రాఖీ పంపేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రాఖీని నమ్మకమైన వెబ్సైట్ లేదా విశ్వసనీయ కొరియర్ సేవ ద్వారా మాత్రమే పంపాలి. విదేశాలకు రాఖీ పంపుతున్నట్లయితే, సంబంధిత దేశాల కస్టమ్స్ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. స్వీకర్త పేరు, చిరునామా, పిన్‌కోడ్, మొబైల్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలి. ఆర్డర్ చేసే ముందు డెలివరీ సమయం, షిప్పింగ్ ఛార్జీలను పరిశీలించాలి. ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ నంబర్, రసీదు, చెల్లింపు వివరాలను భద్రంగా ఉంచుకోవాలి.
బహుమతి లేదా రాఖీని ఎలా ట్రాక్ చేయాలి?
ఆర్డర్ చేసిన వెబ్సైట్ లోకి లాగిన్ అయి ‘నా ఆర్డర్లు’ విభాగంలో సంబంధిత ఆర్డర్‌ను పరిశీలించడం ఉత్తమ మార్గం. అక్కడ ఉన్న ‘ఆర్డర్ ట్రాక్’ ఎంపిక ద్వారా పార్శిల్ ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. కొరియర్ సంస్థ నుంచి ట్రాకింగ్ నంబర్ వచ్చినట్లయితే, సందేశంలో వచ్చిన అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకుండా, ఆ కొరియర్ సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా అనువర్తనాన్ని స్వయంగా తెరిచి ట్రాకింగ్ నంబర్‌ను నమోదు చేయాలి.
ఒక్క చిన్న పొరపాటు.. పెద్ద నష్టం
పండుగ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్‌లో తొందరపడటం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతుంది. “ఇప్పుడే ఆర్డర్ చేయండి”, “చివరి అవకాశం”, “భారీ డిస్కౌంట్”, “బహుమతి గెలుచుకున్నారు” వంటి సందేశాలు కనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా ముందుగా వాటి నిజానిజాలను పరిశీలించాలి. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలు, కార్డు వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింకులు, QR కోడ్లు, చెల్లింపు అభ్యర్థనలకు దూరంగా ఉండాలి. కొద్దిపాటి అప్రమత్తతతో రక్షాబంధన్ పండుగను సైబర్ మోసాల బారిన పడకుండా ఆనందంగా జరుపుకోవచ్చు.
