అప్రమత్తంగా ఉండండి..
మోసగాళ్ల బారిన పడొద్దు
గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త కనెక్షన్లు, రుణాల పేరుతో మోసాలు..
అనుమానిత వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి
ఎస్‌ఐ ముత్యం రాజేందర్
రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్యాస్ ఈ-కేవైసీ, ఆధార్ ధ్రువీకరణ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, వివిధ రకాల రుణాల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్ సూచించారు. అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కొత్త గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని, ముందుగా ఫొటో అప్‌లోడ్ చేయాలని చెబుతూ కొందరు వ్యక్తులు ప్రజలను మభ్యపెడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అంతేకాకుండా మెడలోని బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని, బంగారం ఉంటే ఉచితంగా గ్యాస్ ఇవ్వబోరని నమ్మిస్తూ బంగారం దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలపై ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
ఈ పేర్లతో వస్తే జాగ్రత్త
గ్యాస్ ఈ-కేవైసీ, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఇంటి రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని ఎవరైనా ఇంటికి వస్తే వారి మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు, ఆధార్ సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, నగదు లేదా బంగారం ఇవ్వవద్దని ఎస్‌ఐ సూచించారు. అధికారిక ప్రక్రియ అవసరమైతే సంబంధిత ప్రభుత్వ శాఖలు, గ్యాస్ ఏజెన్సీలు లేదా బ్యాంకులను నేరుగా సంప్రదించాలని కోరారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మి ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయవద్దని, తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను వారికి అప్పగించవద్దని సూచించారు.
అనుమానితులపై సమాచారం ఇవ్వాలి
గ్రామాల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ప్రభుత్వ పథకం, ఈ-కేవైసీ లేదా రుణం పేరుతో ఇంటికి వస్తే ముందుగా వారి వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని ఎస్‌ఐ ముత్యం రాజేందర్ సూచించారు.
