ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ..
ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చు
ఎంపీడీవో ఫణిచంద్ర

హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఇకపై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో ఫణిచంద్ర తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ వినతులను అధికారులకు సమర్పించవచ్చన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ఫణిచంద్ర తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజావాణిలో స్వీకరించే ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని ఎంపీడీవో స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.