తుంగభద్ర జలాలతో పులకించిన శ్రీగుంటిరంగ స్వామి
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ: శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో కొలువైన శ్రీగుంటిరంగ స్వామి ఆలయంలో జలాభిషేకం, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీలో భాగంగా అర్ధరాత్రి వందలాది మంది భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ తుంగభద్ర నదికి పాదయాత్రగా వెళ్లారు. తెల్లవారుజామున నదికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాన్ని సేకరించారు. అనంతరం వాటిని ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి జలాభిషేకం చేశారు.
భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నేలపై పొర్లు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొక్కుబడిదారులు భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పవిత్ర జలాలతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భజన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసం నాలుగో శనివారం శ్రీగుంటిరంగ స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
