కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి

  • జాతీయ రహదారి దాటుతుండగా ఘోర ప్రమాదం

మోతె, ఆంధ్రప్రభ : సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాఘవపురం ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బయ్య మహేష్‌ (14), తండ్రి సైదులు.. పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని జాతీయ రహదారి దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు బాలుడిని బలంగా ఢీకొట్టింది.

కారు ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మోతె ఎస్‌ఐ లచ్చిరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి మృతితో రాఘవపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.