జర్నలిస్ట్ తుకారామ్ కుటుంబానికి అండగా ఉంటాం

  • తుకారామ్ భౌతికకాయానికి జర్నలిస్టుల ఘన నివాళి

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ: కేరమెరి మండల సీనియర్ ఆదివాసీ జర్నలిస్ట్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ఆత్రం తుకారామ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. శుక్రవారం రాత్రి తుకారామ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన సంఘం నాయకులతో కలిసి శనివారం సిర్పూర్‌(యు)లోని తుకారామ్ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తుకారామ్ కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, జర్నలిస్టుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఏజెన్సీ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారానికి తుకారామ్ చేసిన కృషి, జర్నలిజానికి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా తుకారామ్ కుటుంబానికి అందాల్సిన పరిహారం అందేలా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ, ఐజేయూ సీనియర్ నాయకుడు నగునూరి శేఖర్ సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రకాష్‌గౌడ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, నాయకులు తారు, నరేందర్, మేకల శ్రీనివాస్, రాధాకృష్ణచారి, ఎజాస్ అహ్మద్‌, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.