ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ మనోహర్
- ప్రతిభ కనబరిచిన విద్యార్థికి రూ.10 వేల నగదు సాయం
జైనూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పోచంలొద్ది సర్పంచ్ మడావి మనోహర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత జనవరి 26న పోచంలొద్ది ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తానని ఆయన ప్రకటించారు.
ఈ మేరకు శనివారం పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 497 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచిన విద్యార్థి ఆత్రం భీంరావును సర్పంచ్ మనోహర్ సన్మానించి రూ.10 వేల నగదు అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు భీమ్రావు, ఉపసర్పంచ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
