మౌంట్ ఎల్బ్రస్పై త్రివర్ణం..
- ఏలూరు ఎస్సై అరుదైన ఘనత
- 5,642 మీటర్ల ఎత్తులో 100 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన
ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: సాహసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీటర్లు) శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ వెంకటేశ్వరరావు ఈ సాహస యాత్రను పూర్తి చేశారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎముకలు కొరికే చలి, దట్టమైన మంచును అధిగమించి శిఖరాగ్రానికి చేరుకున్నారు.
శిఖరంపైకి చేరుకున్న అనంతరం ఆయన 100 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుకున్నారు. తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూనే మరోవైపు పర్వతారోహణపై ఆసక్తితో ముందుకు సాగుతున్న వెంకటేశ్వరరావు ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించారు. ఇప్పుడు ఆయన తదుపరి లక్ష్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమవుతున్నారు.
ఎస్సై వెంకటేశ్వరరావు సాధించిన ఈ విజయంపై జిల్లా పోలీసు అధికారులు, సహచర సిబ్బంది, ప్రజలు అభినందనలు తెలిపారు. ఆయన సాహసం యువతకు ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు.
