ఎం.ఆర్.సి.వి. గిరిబాబుకు ప్రశంసా పత్రం..

తిరుపతి, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి డివిజనల్ మేనేజర్ ఎం.ఆర్.సి.వి. గిరిబాబుకు గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్‌, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. శోభిక చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. తిరుపతి డివిజనల్ మేనేజర్‌గా గిరిబాబు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి, సంస్థ కార్యకలాపాల విస్తరణకు కృషి చేస్తున్నారు. గిరిజనుల నుంచి చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటి మార్కెటింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహంలో చురుకైన పాత్ర పోషించారు.

గిరిజనులకు అవగాహన కల్పించి అటవీ ఉత్పత్తులను సంస్థకు అందించేలా చైతన్యపరిచారు. వాటికి మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించడం ద్వారా గిరిజనుల ఆదాయం పెంచేందుకు కృషి చేశారు. సంస్థ ఉత్పత్తుల విక్రయాలు, మార్కెట్‌ విస్తరణతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఉత్పత్తుల సరఫరాలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంస్థ ఉత్పత్తుల సరఫరా, మార్కెటింగ్‌, అవసరమైన ఉత్పత్తుల సమీకరణ, సంబంధిత అధికారులతో సమన్వయంలో చురుకుగా పాల్గొన్నారు.

గిరిజనుల నుంచి ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్‌, విక్రయాల పెంపు, మార్కెట్‌ విస్తరణ, ప్రభుత్వ సంస్థలకు సరఫరా, గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు చేసిన కృషిని గుర్తించి ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ప్రశంసా పత్రం అందించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ గిరిజనుల సంక్షేమం, అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌, సంస్థ ఉత్పత్తుల విస్తరణకు మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.