జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అశోక్‌కుమార్‌కు అవార్డు
- మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా పురస్కారం
- పేరూరు గ్రామంలో వెల్లువెత్తిన అభినందనలు
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్‌కు జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చూపిన చొరవ, అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పారిశుధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, పంచాయతీ పరిపాలనపై అశోక్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని గ్రామస్తులు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం, అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడటం ఆయనకు అవార్డు దక్కడానికి కారణమైందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం పేరూరు గ్రామానికి గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ను గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
