ఉత్తమ జూనియర్ అసిస్టెంట్‌గా మౌనికకు అవార్డు

  • ప్రశంసించిన రెవెన్యూ సిబ్బంది

చాగలమర్రి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన చాగలమర్రి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులం మౌనికకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ జూనియర్ అసిస్టెంట్‌గా, ఉత్తమ బీఎల్‌ఓగా ప్రశంసా పత్రం లభించింది. శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనోర్ చేతుల మీదుగా మౌనిక ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

విధి నిర్వహణలో భాగంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓర్పు, సహనంతో సేవలందించినందుకు ఆమెను అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే ఉత్తమ బీఎల్‌ఓగా ప్రసాద్‌రెడ్డి కూడా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చాగలమర్రి తహసీల్దార్ ఫణీంద్రుడు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్తార్, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులు, సహాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు మౌనికను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రశంసా పత్రాలు అందుకోవాలని ఆకాంక్షించారు.