దైవ భక్తితో కూడిన దేశ భక్తి..

  • త్రివర్ణ రంగులతో శివాలంకరణ..
  • ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురంలో భక్తులు దైవభక్తితో కూడిన దేశభక్తిని చాటిచెప్పారు. పట్టణంలోని శారద హాల్ ప్రాంతంలో ఉన్న శ్రీ కామాక్షీ సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారిని జాతీయ జెండాలోని త్రివర్ణ రంగులతో అలంకరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో స్వాతంత్ర్య వేడుకలను ఆధ్యాత్మిక భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పురాణం గణేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటేలా స్వామివారిని త్రివర్ణ పతాకాన్ని పోలిన ప్రత్యేక వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. జాతీయ జెండా రంగులను ప్రతిబింబించేలా చేసిన త్రివర్ణ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తిభావంతో పాటు దేశభక్తిని చాటిచెప్పాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.