28-60-percent బీసీలకు భారీ బూస్ట్ Andhra Prabha Exclusive Story
28-60-percent బీసీలకు భారీ బూస్ట్ Andhra Prabha Exclusive Story
- స్థానిక సంస్థల్లో 28.60% రిజర్వేషన్
- 134 పంచాయతీలు బీసీలకే
- రిజర్వేషన్‌పై బీసీ కమిషన్ కీలక సిఫార్సు
- శ్రీ సత్యసాయి జిల్లాలో కీలక పరిణామం
( శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా రాష్ట్ర బీసీ కమిషన్ కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. బీసీలకు 28.60 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈసారి పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ వార్డుల్లో బీసీలకు అదనపు స్థానాలు దక్కనున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలకు గాను 134 సర్పంచ్ స్థానాలను బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం. 2021కు ముందు జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇది బీసీ ప్రాతినిధ్యంలో పెరుగుదలను సూచిస్తోంది. 2020లో జిల్లాలో 465 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, బీసీలకు 127 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. తాజా సిఫార్సులు అమల్లోకి వస్తే ఈ సంఖ్య 134కు చేరనుంది.
వార్డుల్లోనూ పెరుగుదల…
గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యుల స్థానాల్లో కూడా బీసీ కోటా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని 4,912 పంచాయతీ వార్డుల్లో 1,374 వార్డులు బీసీలకు దక్కే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం మరింత విస్తరించనుంది. స్థానిక పాలనలో బీసీల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సిఫార్సులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎంపీటీసీ స్థానాల్లో మార్పులు…
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) స్థానాల్లోనూ బీసీ కోటా పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 838 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 242 స్థానాలను బీసీలకు కేటాయించాలని సిఫార్సు చేశారు. 2021లో 841 ఎంపీటీసీ స్థానాలకు గాను 244 స్థానాలను బీసీలకు కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజన, స్థానాల సంఖ్యలో మార్పుల నేపథ్యంలో ఈసారి రిజర్వేషన్ల కేటాయింపు కొత్తగా జరగనుంది.
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) విషయంలోనూ బీసీలకు గణనీయమైన ప్రాతినిధ్యం కొనసాగనుంది. మొత్తం 63 జెడ్పీటీసీ స్థానాల్లో 18 స్థానాలను బీసీలకు కేటాయించాలని ప్రతిపాదించారు. 2021 ఎన్నికల్లోనూ మొత్తం 18 జెడ్పీటీసీ స్థానాలు బీసీలకు దక్కాయి. దీంతో జెడ్పీటీసీ స్థాయిలో బీసీ రిజర్వేషన్లలో పెద్దగా మార్పు ఉండకపోయినా, ఇతర స్థానిక సంస్థల్లో మాత్రం పెరుగుదల కనిపించనుంది.
*పట్టణ స్థానిక సంస్థల్లోనూ పెంపు…
పట్టణ ప్రాంతాల్లో కూడా బీసీ రిజర్వేషన్ల వాటా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో నగరపాలక సంస్థతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 204 వార్డులు ఉండగా, వీటిలో 72 వార్డులను బీసీలకు కేటాయించాలని సిఫార్సు చేశారు. 2021 ఎన్నికల్లో 66 వార్డులు బీసీలకు కేటాయించగా, ఈసారి మరో ఆరు వార్డులు పెరిగే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 174 వార్డులు ఉన్నాయి. వీటిలో 66 వార్డులను బీసీలకు కేటాయించనున్నట్లు సిఫార్సులు వెల్లడిస్తున్నాయి. 2021 ఎన్నికల్లో కేవలం 57 వార్డులు మాత్రమే బీసీలకు దక్కాయి. తాజా ప్రతిపాదనలు అమలైతే మరో తొమ్మిది వార్డులు బీసీ రిజర్వేషన్ పరిధిలోకి రానున్నాయి.
ఇది కీలక పరిణామం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన కమిషన్ సిఫార్సులు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ స్థాయి వరకు బీసీలకు ప్రాతినిధ్యం పెంచడం ద్వారా స్థానిక పాలనలో వారి భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు పెరగడం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ వర్గాలకు రాజకీయ అవకాశాలను విస్తరించే అవకాశం ఉంది.
అయితే కమిషన్ సిఫార్సుల అనంతరం ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం, రిజర్వేషన్ల అమలు విధానం, నియోజకవర్గాల వారీగా రిజర్వేషన్ రొటేషన్ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఏ పంచాయతీ, ఏ వార్డు, ఏ ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ స్థానం ఏ వర్గానికి కేటాయించబడుతుందనే విషయం స్పష్టమవుతుంది.
మొత్తంగా చూస్తే 28.60 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు. 2021తో పోల్చితే శ్రీ సత్యసాయి జిల్లాలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ వార్డుల స్థాయిలో పెరుగుతున్న స్థానాలు బీసీ వర్గాల్లో రాజకీయంగా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
