కొయ్యలగూడెంలో ప్రతిభావంతులకు నగదు పురస్కారం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు శనివారం గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్ రూ.10 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న అశోక్ మాట్లాడుతూ కొయ్యలగూడెం ఉన్నత పాఠశాలలో చదువుతూ ప్రతి ఏటా మండల, జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహంగా నగదు పురస్కారాలు అందిస్తానని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధిలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములై కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ గ్రామ ప్రగతితో పాటు పాఠశాల పురోగతిలోనూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, గ్రామ ఉపసర్పంచ్ జెల్లా పవన్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ నిర్మల, మాజీ సర్పంచ్ గడ్డం నరసింహ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు కోటేశ్వర్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
