ప్రజల భద్రతే ప్రజా ప్రభుత్వ బాధ్యత..

మక్తల్, ఆంధ్రప్రభ : ప్రజల భద్రతే ప్రజా ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అగ్నిమాపక కేంద్ర భవనానికి శనివారం మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నూతన అగ్నిమాపక కేంద్ర భవనం పూర్తయితే అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన ప్రాంతాల్లో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భవన నిర్మాణ నమూనాలో కొన్ని మార్పులు, చేర్పులను ఇంజినీర్లకు సూచించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మతు, హౌసింగ్ ఏఈ మల్లికార్జున్, స్పెషల్ ఆఫీసర్ బాలాజీ, జిల్లా అధికారి జి.వి. ప్రసాద్, ఇన్‌చార్జి ఆర్‌ఎఫ్‌ఓ నరేష్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.