రామాలయంలో సామూహిక కుంకుమ పూజలు

మంగపేట, ఆంధ్రప్రభ : శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం (రామాలయం)లో శుక్రవారం సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యుల ఆధ్వర్యంలో మహిళా భక్తులు దీపారాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారి (లక్ష్మీదేవి) ప్రతిమను పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య మహిళా భక్తులు లక్ష్మీ అష్టోత్తరం, కుంకుమ అర్చన మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు చేయడం అత్యంత శుభప్రదమని, ఈ పూజలతో కుటుంబాల్లో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భక్తులకు వివరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కోరుకోప్పుల శంకర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.