దసరా నాటికి దుర్గమ్మ భక్తులకు మెరుగైన వసతులు

  • అభివృద్ధి పనుల నాణ్యతపై సంతృప్తి
  • భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
  • మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి భవనాల ప్రారంభానికి చర్యలు
  • ఎంపీ కేశినేని చిన్ని
  • లడ్డు పోటు అన్నదాన భవనాలను పరిశీలన

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిధిలో శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) శుక్రవారం పరిశీలించారు. ఆలయ ఈఓ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ సీనా నాయక్‌, పాలకమండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎంపీ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన అన్నదాన భవనం, ప్రసాదం తయారీ భవన నిర్మాణ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, భక్తులకు అందుబాటులోకి రానున్న వసతులు, మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ఎంపీ కేశినేని చిన్ని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నూతన అన్నదాన భవనం, ప్రసాదం తయారీ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తికావడం సంతోషకరమన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్‌ మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నూతన భవనాలను వైభవంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.