ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారులు ప్రజల ఆస్తే!

  • కొత్త రోడ్లపై భారీ వాహనాలతో నష్టం చేయొద్దు
  • అభివృద్ధి పనులను కాపాడుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలి
  • క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల నాణ్యతపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టి

తిరువూరు, ఆంధ్రప్రభ: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ నిధులతో ఎంతో శ్రమించి నిర్మిస్తున్న కొత్త రహదారులు కొందరి నిర్లక్ష్యం కారణంగా దెబ్బతినకుండా ప్రజలు, వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులు సక్రమంగా కొనసాగుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా నిర్మించిన రహదారులపై భారీ వాహనాలు, ఫుల్‌ వీల్స్‌ ట్రాక్టర్లను నడపడం వల్ల రోడ్ల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని వాహనదారులకు సూచించారు.

రైతులు, వాహనదారులు, ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి పనులను తమ సొంత ఆస్తిగా భావించి సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మిస్తున్న రహదారులు, ఇతర మౌలిక వసతులు ఎక్కువ కాలం ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రతి రహదారి ప్రజల ఆస్తేనని, అభివృద్ధి పనులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తూ అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొనసాగిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చర్యలకు ఇది నిదర్శనంగా నిలిచింది.